పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

143

తలుపులు బిగించాడు. పావు గంటలోనో, అరగంటలోనో, ఇండియా హౌస్ దగ్గర బండి ఆగింది. మేము దిగి లోపలికి వెళ్ళాము. అక్కడున్న వసతి యజమానికి కాబోలు నా స్నేహితుడు నన్ను పరిచయంచేశాడు. నా బాధ్యత అతనికిఒప్పగించి, అతని కరచాలనం చేసి "Good bye and goodluck young man, I wish you well అని చరచరా బయటికి వెళ్ళిపోయాడు. నా సామాను లోపలికి రావడం నేను చూడనేలేదు. నా వెనుకనే వున్నది. ఆ యజమాని నన్నొకసారి నిదానంగా చూచి “ఇండియాలో ఏ ప్రాంతం నుంచి వచ్చావు” అన్నాడు. “మెడ్రాస్” అన్నాను దర్జాగా.

నన్ను కూర్చోమని సంజ్ఞ చేశాడు. నే కూర్చున్నాను. “ఇక్కడి కెందుకు వచ్చా” వన్నాడు. “ఎందుకొచ్చావేమిటీ వెధవ ప్రశ్న? అంత దూరము నుంచి, తన ముఖారవిందము చూడటానికి వచ్చాననుకున్నాడు కాబోలును. నేను చదువుకోవడానికి వచ్చాను.” అన్నాను. “ఏం చదువు తావు” అన్నాడు. “చదవడానికి కేమివుంది - బారిష్టరు తప్ప మరేం చదవనని నా అభిప్రాయము.” “ఈవూళ్లోనేనా?” అన్నాడు. “బహుశా ఎడింబరో అనుకుంటున్నాను” అన్నాను. “అయితే ఇక్కడ ఎన్నాళ్ళుంటావు” అన్నాడు. “ఒక్కరోజుకంటే తప్పితే రెండు రోజులుకంటే "ఉండ నన్నాను” “నీవు భోజనము చేయ్యలేదు కదా!” అన్నాడు “లే”దన్నాను. అయితే “నీవు భోజనాల గదిలోకి వెళ్ళి అక్కడ భోంచెయ్యి. “ఈ లోపున నీకు గది ఏర్పాటు చేస్తాను” అన్నాడు.

భోజనాల గది ఎక్కడ వున్నదా అని నేను ఆలోచించే లోపున నా ఊహ కని పెట్టినట్టు ఆ క్షణంలోనే అక్కడకు వచ్చిన, ఒక మనిషిని చూపించి “ఇతను నిన్నక్కడకు తీసుకు వెడతాడు. నీవు భోజనానికి ఏమి కావలెనో చెప్పితే ఏర్పాటు చేస్తాడు.” అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఈ కొత్త మనిషి - అక్కడ నౌకరు కాబోలు నన్నెంతో గౌరవంతో లోపలికి తీసుకు వెళ్ళాడు. అదొక పెద్ద గది. ఎంతో విశాలంగా వుంది. గదిమధ్యను నిలువునా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెద్ద బల్ల, దాని చుట్టూ కుర్చీలూ, అప్పుడే భోజనాలు చేసి ఒక పంక్తి లేచింది కాబోలు "బల్లనిండా పళ్ళాలు, వాటినిండా భుక్త శేషం. మంచినీళ్ళగ్లాసులు, చెంచాలు, కత్తులు వగైరా సొమాగ్రి అంతా పరచి వున్నాయి. కొందరు యువకులు మగవాళ్లు అక్కడే గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ ఒక్కసారి నా కేసి తిరిగి, నన్నో కొత్త జంతువును చూసినట్లు చూశారు. వారప్పటికి పెద్ద నాగరి