పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

బారిష్టరు పార్వతీశం

దారి పొడుగునా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది వాళ్ళ దేశంలో ఉపయోగించే రగ్గు” అన్నాడు అక్కడ ఉన్న ఆసామీ “ఓహో అలాగా, చాలా బాగుంది. పోనీ ఇది అమ్ముతాడేమో కనుక్కో” అనీ అడగగా నా స్నేహితుడు “ఇంకచాల్లే ఊరుకో” అన్నట్టు సంజ్ఞ చేశాడు. అదికాదయ్యా యీ పసివాడికి ఇది అమ్మే ఉద్దేశం ఉంటే, గవర్నమెంటుచేత కొనిపించి బ్రిటీషు మ్యూజియంలో పెట్టిద్దామని గాని, నాకోసం కాదు. అతనికి లాభంగా ఉంటుంది. పోన్లే ఇంతకీ నా కెందుకు? అని తక్కిన వన్నీ కూడా చూడడం పూర్తి చేసి, ముగించబోతుంటే, నా కచికలూ, తటాకులూ ఉన్న పొట్లం వాడి కంటపడింది. అది విప్పి, “ఇదేమైన తినేదా, అన్నాడు. లేకపోతే మందా? అన్నాడు. ఇదేం విషం కాదుగదా” అన్నాడు. మావాడు వీరగబడి నవ్వుతున్నాడు. పై కుబుకుతున్న, నా ఉద్రేకం తగ్గించుకుని, “అలాంటిదేం కాదు. ఈచూర్ణం నా పండ్లు తోముకోవడానికి, ఈ ఆకులు నాలుక గీసుకోడానికి అని చెప్పాను. వాడికేమీ పూర్తిగా అర్థం కాలేదు. “సరే, మీ కర్మ” అన్నట్టు గబగబా మాకు బయటకు వెళ్ళడానికి అనుమతి రాసియిచ్చి లేచిపోయాడు. నేను చచ్చినట్టు అవన్నీ మడిచి మళ్ళీ లోపల సర్దుకున్నాను.

2

మేము బయటికి వచ్చాము, మావెనుకనే నాసామానూ వచ్చింది. బైటికి రావడంతో, వీధిలో విపరీతమైన జన సమూహం అన్ని వైపులకూ ఎంతో తొందరగా నడిచిపోతున్నారు. ట్రాము కార్లు, మోటారు కార్లు, గుర్రంబళ్లు వేలాది సంఖ్యలో దౌడు తీస్తున్నాయి. ఇంత హడావిడి ఏమిటో ఎక్కడికి పోతున్నారో వీళ్ళంతా అనుకున్నా నొక్కమాటు. ఇక్కణ్ణించి ఎక్కడకు వెళ్ళడమా. ఇంకను ఈ కుక్ మనిషి నన్నిక్కడ విడిచిపోతాడు కాబోలు. ఎలాగా అనుకుంటూ నన్నెక్కడి కేని హోటలుకి చిన్నదైతే సరిపోతుంది పంపుతావా! అన్నాను అంటే అతను “హోటలుకి వద్దు. మీకంతా కొత్తగా వుంటుంది. మీకే సలహా చెప్పేవాళ్లు వుండరు. ఇక్కడ ‘ఇండియా హౌన్’ అని ఒకటి గవర్నమెంటువారు ఏర్పాటుచేసిన వసతి గృహం వున్నది అందులో అందరూ మీ దేశస్థులుంటారు. నిన్నక్కడ దిగబెడతాను, అక్కడ నుండి నీ తరువాత ఏర్పాట్లు చేసుకో” అని ఓ గుర్రబ్బండి పిల్చి, నన్నందులోకి ఎక్కమని, తనూ నాతో కూర్చుని, కాయ్ వెల్ రోడ్డుకు పోనిమ్మని బండివానితో చెప్పి, చలిగాలి తగలకుండా