పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

141

విద్య నేర్చుకుని, క్షణంలో ఆమెట్లు ఏ ప్రమాదం లేకుండా ఎక్కడం, అన్నీ రెప్పపాటులో జరిగిపోయినాయి. మరికొంత దూరం సాదా ప్రదేశం మీద నుంచి ఇది నడుస్తుండగా, నా స్నేహితుడు పక్కకు తప్పుకుంటూ నన్ను కూడా తనతోపాటు పక్కకు లాగేశాడు. ఆ ప్లాట్ ఫారం దారి దానిది అదో సెలయేరులా పోతూనేవుంది.

మేము మరో పది బారలు నడిచి, ఒక పెద్దగది దగ్గర ఆగాము. అతను తలుపు తీయగా లోపల ప్రవేశించాను. నా సామానప్పుడే అక్కడికి ఎలా చేరిందో చేరింది, అక్కడ పది మంది, బల్లల ఎదుట కుర్చీల మీద కూర్చుని, అక్కడకు వచ్చిన జనాభా సామానులు పెట్టెల్లోంచి తీయించి పరీక్ష చేసి, ఓ చీటి యిచ్చి, వెలుపలకు పంపిస్తున్నారు.

నాపెట్టెలు చూడ్డానికి సిద్ధంగా ఉన్న మనిషి, నన్నెగా దిగా చూసి, నా స్నేహితుడితో అర్దోక్తిలో “Who is this darke?” అన్నాడు. నా స్నేహితుడు “ఇష్” అని నోరు ముయ్యమన్నట్లు, పెదవుల మీద వేలు వేట్టుకుని సంజ్ఞ చేశాడు. This young prince is my friend from India, come to study here" (ఈ పిల్ల జమిందారు నా స్నేహితుడు. ఇండియా నుంచి వచ్చాడు ఇక్కడ చదువుకోసం.) అని సామాను త్వరగా చూడమని సంజ్ఞ చేశాడు.

వాడు పెట్టెతీసి, ఒక్కొక్క వస్తువే ముని వేళ్ళతో యెత్తి దూరంగా క్రింద పడేస్తున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. నేనేదో అనబోతున్నానని నామిత్రుడు గ్రహించి, నాచెయ్యి గట్టిగా అదిమాడు, ఏమీ మాట్లాడవద్దన్నట్లు. తరువాత నా పరుపు చుట్టు విప్పాడు. అందులో నా నారింజపండు రంగు శాలువా చూసి, నిర్ఘాంతపోయి గుండెల మీద చెయ్యివేసుకుని, కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కు జార్లపడిపోయాడు. ఇదేమిటో వాడిలా పడిపోయాడు కొంపతీసి మన కళ్ళ ఎదటనే “హరి” అనడుగదా అని హడలిపోయాను. క్షణంలో తేరుకున్నట్టు కళ్ళు తెరచి, “What is this?” (ఏమిటిది.) అన్నాడు. My shawl అన్నాడు. “your what” (నీదేమిటీ?) అన్నాడు “My శాలువా” అన్నాను.

వాడెంతో జాలిగా, నాకేసి చూసి “can't you speak English my lad” (ఇంగ్లీషు మాట్లాడ లేవా నాయనా!) అన్నాడు.

నేను సమాధానం చెప్పబోతుంటే, నా మిత్రుడు “ఆయన ఇంగ్లీషు మాట్లాడ లేక పోవడ మేమిటి? చాలా చక్కగా మాట్లాడుతాడు. రైల్లో