పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

బారిష్టరు పార్వతీశం

అర్థంకాని, స్వచ్ఛంగా పలుకలేని మాటలున్నాయంటే, వాడి కెలా వస్తుంది చెప్పండి. అదేం చచ్చు ఇంగ్లీషా. ఎవడు పడితే వాడు ఏడాదిలోనో, రెండేళ్ళల్లోనో నేర్చుకోడానికి! మేము రైలు దగ్గరకు వచ్చి, ఒక పెట్టెలో ఎక్కబోయేసరికి, ఎవడు తెచ్చాడో, ఎప్పుడు తెచ్చాడో, తెలియదు కాని, నా పెట్టే, పరుపూ అప్పుడే అందులో వున్నాయి. “ఇదుగో బాబూ - మీ మీ అదేమిటో అన్నావు......” వాడిని చూచి నేనూ నవ్వాను. ఎటొచ్చీ వాడొకందుకు నవ్వుతే నేను మరొకందుకు నవ్వాను.

అప్పటికి అయిదో, అయిదున్నర గంటలో అయినా, బాగా చీకటి పడిపోయింది. పొగో, పొగమంచో తెలియకుండా పది అడుగులలో ఉన్న మనుష్యులు కూడా కనబడనంత వత్తుగా, దట్టమైన తెరలా మమ్మల్ని కమ్మేసింది. విపరీతమైన చలిగా ఉంది. ఇంత గాఢాంధకారంలోనూ రైలు వెడుతుందా అనే సందేహం కలిగింది నాకు. సందేహం కలగడం తడవుగా, ఈ కటిక చీకట్లో రైలు వెడుతుందా భయంలేకుండా నన్నాను. యధాలాపంగా నా లోపలి ఊహల్ని పైకి అన్నట్టుగా - అతని తోటి చెప్పినట్టు గాకుండా, అతనొక్కసారి నా కేసి నిదానంగా చూసి, “ఏం భయం లేదు - మనకూ భయంలేదూ - దానికీ భయం లేదు, ఒక జోడా మను ష్యులు లాంతర్లు పట్టుకుని, రైలు పట్టాలు తప్పిపోకుండా దాని ఎదుట నడుస్తారు” అన్నాడు చాలా గంభీరంగా.

అయినా వాడేదో నన్ను వేళాకోళం చేస్తున్నాడనుకొన్నాను. నేను నాకు కలిగిన సందేహాన్ని పైకి అనడం పొరపాటేననుకున్నాను. అప్పుడు నిడదవోలునుంచి నేనెక్కిన రైలు మద్రాసు వరకూ రాత్రి ప్రయాణము చేసిన సంగతీ, తరువాత మద్రాసునుంచి మళ్ళీ రాత్రి చేసిన ప్రయాణం స్ఫురణకొచ్చి, నా తెలివితక్కువ తనానికి నవ్వుకున్నాను. అయితేమట్టుకీ మాత్రం దానికి వాడు నన్ను చూచి నవ్వుతాడా అని కొంచెం కోపం వచ్చిన మాట వాస్తవమే. అయినా నాలో నేను సముదాయించుకుని, ఒకటి రెండుసార్లు వాడేదో చెప్పబోతే నేను వినీ విననట్లు సమాధానం చెప్పకుండా ఊరుకున్నాను. లండన్ చేరేవరకూ నా మౌనం నేను విడవలేదు. ఏ అవాంతరం లేకుండా మేము లండన్ క్షేమంగా చేరాము దైవానుగ్రహం వల్ల. లండన్ స్టేషన్ రాగానే రైలు స్టేషన్ లోకి కాక ఏదో ఇంట్లోకి వెళుతున్నట్టు అనిపించింది. ఎందుచేతనో తెలియదు. నాతో కూడా ఉన్న ఆసామీ నడుగుదామంటే, మళ్ళీ అతను ఏమి వేళాకోళం చేస్తాడో అని సందేహించి ఊరుకున్నాను.