పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

137

నా గురించి చాలా విన్నానంటాడు. చాలా చిత్రంగా ఉన్నదే, నేను గొప్పవాడి నని వాడెలా కనిపెట్టగలిగాడు? నన్ను గురించి అప్పుడే లండన్ లో అడుగు పెట్టి ఇంకా అరగంటేనా కాకుండా - ఎలా విన్నాడు? చాలా చిత్రంగా ఉన్నదే అని ఆశ్చర్యపోతూ, వాడికంటే మనమేమీ తీసిపోకూడదనుకుంటూ “Yes sir, I Parvatesam, how you know me Cookగారూ” అన్నాను ఇంగ్లీషులో. నాకు కూడా ఇంగ్లీషు వచ్చు సుమా, అట్టే పిచ్చి వేషాలేమన్నా వేస్తే నా దగ్గర సాగవని హెచ్చరించడానికి. "Good, lad clever Aren't you? Come, Hurry" అంటూ నా చెయ్యి పట్టుకుని లాక్కుపోవడం మొదలు పెట్టాడు. yes coming, my Samans sir' అంటుంటే వినిపించుకోడు. ఈ చెవిటి మాలోకమేమిటి బాబూ అనుకుని, ఒక్క వూపుతో నా చెయ్యి విదిలించి “My Saman there, ! go and get saman and come" అన్నాను. వెనక్కి తిరిగి సామాన్లు చూపిస్తూ (ఏమిటయ్యా, ఈ హడావిడి. నా సామాన్లు ఉండవయ్యా! నా సామాన్లు తీసుకుని వస్తాను Oh oh! you and your bloody saman what do you mean saman (ఏమిటయ్యా నీ వెధవ సామానూ నువ్వూనూ అసలు సామానంటే ఏమిటి అన్నాడు. 'My box sir and bed sir' (నా పెట్టే పరుపూనండీ) అన్నాను వాటికేసి చూపిస్తూ 'Oh, that' (అదా) అని ఓ పెద్ద నవ్వు నవ్వి సామాన్, సామాన్ అని నాలుగు సార్లు అనుకుని ఫరవాలేదు, నీ సామాను ఎక్కడికీ పోదు వాటినీ తీసుకురమ్మని ఒకమనిషితో చెప్పాను. తీసుకు వస్తాడు. మనం తొందరగా వెళ్ళి ఆ రైలు ఎక్కాలి అన్నాడు. అక్కడున్న రైలు కేసి చూపీస్తూ. స్టీమరులో నుంచి దిగిన జనమంతా ఆ రైలు కేసి హడావిడిగా వెళ్ళి అందులో ఎక్కుతున్నారు.

“మనం ఇంగ్లండు వచ్చాం కదా; మళ్ళీ ఈ రైలు ఎందుకు ఇంకో ఎక్కడికి వెళ్ళా”లన్నాను. ఇది ఇంగ్లండే, నిజమే అయితే, ఇంగ్లండు కిది మొదలన్నమాట. లండను ఇక్కడికి కొన్ని మైళ్ళ దూరముంది. మూడుగంటల ప్రయాణం చేస్తే సుమారు ఎనిమిదింటికి అక్కడకు చేరుకుంటాము. నిన్నక్కడకు చేరుస్తే, మాబాధ్యత వదిలిపోతుంది. తరువాత నీ దారి నువ్వు చూసుకోవలసినదే. అన్నాడు తొందరగా నడుస్తూ. అంతసేపూ నా చెయ్యి వదలలేదు పాపం. ఈ సంభాషణంతా ఆంగ్లంలోనే జరిగింది సుమండీ, వాడికి తెలుగెలా వచ్చిందనుకునేరు. చస్తే వాడికి తెలుగురాదు. ఎన్ని వేలేళ్ళు తపస్సు చేసినా, ఒక్క తెలుగుముక్క వాడి చేత పలికించలేము, తెలుగుదేశంలో పుట్టి పెరిగిన నాకే యింకా బోలెడన్ని