పుట:బహుముఖ ప్రజ్ఞాశాలి మహాకవి దాసు శ్రీరాములు.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంఘ సంస్కరణోపన్యాసాలు - స్త్రీ విద్య - స్త్రీ స్వాతంత్య్రం

సంఘసంస్కరణ సమస్యలు ముఖ్యంగా స్త్రీ విద్య, స్త్రీ స్వాతంత్ర్య ఆవశ్యకత గురించి ఆంధ్రదేశమంతటా సభలు నిర్వహించి అనేక ఉపన్యాసాలు చేసారు. వీరి ప్రచారానికి ప్రభావితులై అనేక పల్లెలలో బాలికా పాఠశాలలు వెలిసాయి. ఇతరులకు చెప్పటంతో సరిపెట్టుకోకుండా స్వయంగా ఆచరించి చూపెట్టారు. తన యేడేళ్ళ కుమార్తె శారదాంబకు ఆంధ్ర, సంస్కృతాలు, సంగీత విద్య నేర్పించారు. వితంతవులకు కేశఖండనం క్రూరమైన ఆచారం అన్నారు. 'రండాముండన ఖండన' అనే వ్యాసాన్ని వ్రాసి ప్రచారం చేసారు. బాల్య వివాహాలను నిరసించారు. స్త్రీలు గడపదాటకుండా ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. వారు సభలకు వెళ్లేటపుడు భార్య జానకమ్మను కూడా తీసుకువెళ్లేవారు.

వాగ్గేయకారులు - సంగీత రచనలు

తోట్లవల్లూరు వేణుగోపాలస్వామికి అంకితంగా, భగవన్నామ పఠనానుకూల "కృతులు, పదములు, జావళీలు" ముఖ్యంగా అభినయాన్ని దృష్టిలో ఉంచుకొని రాసారు. స్వరజతులు, తిల్లానాలు కూడా వ్రాసారు. అనేకమంది గాయనీ, గాయకులు కచేరీలలో గానం చేస్తున్నారు. నర్తకులు, నర్తకీమణులు నృత్యప్రదర్శనలు ఇస్తున్నారు. శ్రీరాములుగారు ‘అభినయదర్పణం' అనే గ్రంథాన్ని రాసారు. స్వయంగా ముద్రలు పట్టి చూపేవారు.

సంగీత పాఠశాల స్థాపన - విద్వాంసులకు ప్రోత్సాహాలు

ఆనాటి ప్రసిద్ధ సంగీత విద్వాంసులు శ్రీ నల్లాన్ చక్రవర్తులు తిరువేంగడాచారిగారిని ప్రధానోపాధ్యాయునిగా నియమించి సంగీత పాఠశాల నెలకొల్పి, ఎందరో విద్వాంసులను పోషించారు. పండితులను గాయకులను సన్మానించారు. హరికధా పితామహులు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు, తిరుపతి వేంకటకవులు, మొదలైన ప్రముఖులు శ్రీరాములు గారి ఆతిధ్య సన్మానాలు పొందినవారే.

రచనలు

శతకములు, ప్రబంధములు, పురాణములు, నాటకములు, యక్షగానములు,'కృతులు పదములు జావళీలు' అను సంగీత రచనలు, ధర్మశాస్త్ర, ఆయుర్వేదశాస్త్ర పరిశోధనా గ్రంధములు మొదలైన ఎన్నో ప్రక్రియలలో ముప్పై పైగా రచనలు చేసారు. వాటిలో బహుళ ప్రచారంలో ఉన్నవి 'తెలుగునాడు', 'సూర్యశతకము', 'చక్కట్లదండ', 'అభినవగద్య ప్రబంధము', 'కురంగ గౌరీశంకరనాటిక', 'శ్రీదేవీ భాగవతము', 'దురాచారపిశాచభంజని,'ఆచార నిరుక్తి', 'వైశ్యధర్మదీపిక', 'విగ్రహారాధన తారావళి' అను ధర్మశాస్త్ర గ్రంథములు. మరియు "భృంగరాజమహిమము" అను ఆయుర్వేద శాస్త్రపరిశోధనా గ్రంథము.

5