పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

బసవపురాణము

ఈ పద్మరసు మంత్రిపదమును విడిచి బేలూరులోనే వసించుచుండెను. త్రిభువన తాతాచార్యుఁడని యొక యాంధ్రదేశ బ్రాహ్మణుఁడు విష్ణువే పరదైవమని స్థాపించుటకై యనేకస్థలముల కేఁగి వాదార్థములు నెఱపి జయమందుచుండెను. దోరసముద్రము (బల్లాళరాజు రాజధాని) నకు వచ్చి బల్లాళరాజును దర్శించి శాస్త్రార్థము చేయింపఁగోరెను. రాజు పద్మరసును బిలిపించెను. త్రిభువన తాతాచార్యునకును, బద్మరసునకును శాస్త్రార్థము జరిగెను. వాదమునఁ బద్మరసు గెలిచెను. వాదనిర్ణయప్రకారము త్రిభువన తాతాచార్యుఁడు వైష్ణవమతము వీడి పద్మరసునకు శిష్యుఁడై వీరశైవదీక్షఁ గొనెను.

పిదపఁ పద్మరసు తన కుమారుఁడయిన కుమారపద్మరసుకు జ్ఞానోపదేశమును జేసి కాశీయాత్ర వెడలి మార్గమునఁ బంప (హంపి)కు వచ్చి హరిదేవకవిని జూచి "ఉమాపతి నిన్ను నేఁటి కెనిమిదవనాఁడు తనలోఁ జేర్చుకొనును, అంతలో నీవు రచించు కావ్యమును ముగింపుము” అని చెప్పి కాశి కేఁగి యక్కడ విశ్వేశ్వరునితో నైక్యమందెను.

కెరెయ పద్మరసు త్రిభువన తాతాచార్యులతో శాస్త్రార్థము నెఱపునప్పుడు నరసింహబళ్లాళుని యాస్థానమున నీ క్రింది కవీశ్వరులుండిరి. దోరసముద్రపు రామన్న, ఉభయకవిశరభభేరుండుఁ డనఁబడు కవీంద్రరాఘవుఁడు, హుళిగరమాయిదేవ పురాణభట్టు, గురుభక్త కామన్న, విశ్వన్న, ఉద్ధతశాస్త్రి, నికరభంజన నాగనాథార్యుఁడు, అతిరసికకర్ణాభరణబుధవరుఁడు పదవాక్యప్రమాణజ్ఞ దేవరస పండితుఁడు, అనేకకలావేత్త హంపి రావితందె, జగదారాధ్య నాగిదేవుఁడు, అష్టభాషాకవీశ్వర శివదాఁడు, శైవవిరుద్ధమతదావదాదర సుశరణకవి - ఇత్యాదులు.

పద్మరసు నరసింహబల్లాళుని సభలో శ్రీశివాద్వైతసాకారసిద్ధాంతసానందచరిత్రమను సంస్కృతగ్రంథమును రచియించి, త్రిభువన తాతాచార్యులను జయింపఁగా సభలోని విద్వాంసులెల్లరును నీ క్రిందివిధముగా నాతనిఁ బ్రశంసించిరి.