పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

63

ఈ శాసనమప్పటిది. బిజ్జలుఁడు దేవాలయమునకు దానము చేసినప్పుడు మహామండలేశ్వరుఁడని పయిశాసనమునఁగలదు. కావున నప్పటి కాతఁడు మూఁడవ తైలపదేవుని నోడించి స్వతంత్రుడు గాలేదు. అనఁగా నాకాలము క్రీ.1162కుఁ బూర్వమగును.

పద్మరసు

ఈతని తాత శివయోగి మల్లికార్జునుఁడు. మల్లరసని యాతని నామాంతరము. కర్ణాటకదేశమందలి కల్లకురికియం దాతఁడు ప్రభువై యుండి విరక్తుఁడై శ్రీశైలమున కరిగెను. తత్పుత్రుఁడు సకలేశమాదరసు కొంతకాలము కల్లకురికిని బాలించి విరక్తుఁడై శ్రీశైలమున కరుగుచుఁ ద్రోవలో శిష్యప్రార్ధనమున 'అంబ' యనుగ్రామమునఁ గొంతకాలము వసించి పిదప శ్రీశైలమున కరిగి తండ్రియయిన మల్లరసును జూడఁగా నాతఁడు, “నీ వింకను నేనూఱేండ్లు భూలోకమున వసించి కల్యాణకటకమున ధర్మస్థాపనార్థమై పుట్టిన బసవనితోఁ గలసి వర్తింపుము” అని నిబోధించెను. ఈతని పుత్త్రుఁడు మాయిదేవుడు అంబగ్రామమం దుండెను. ఆతనికి నరసింహబల్లాళుని దండనాయకుఁడును కమ్మకులవల్లభుఁడును నగు గౌరప్ప యక్కయగు మంగళ నిచ్చి పెండ్లిచేసిరి. వీరి పుత్త్రుఁడే కెరెయపద్మరసు. ఈతని భార్య దండనాథగౌరప్ప పుత్త్రియగు మాదేవి. నరసింహ బళ్లాళుఁడు గౌరప్ప కనంతర మా దండనాయకపదమును పద్మరసు కొసఁగెను.

పద్మరసు గురుపరంపరకుఁ జేరినవాఁడు; చతుశ్శాస్త్రపండితుఁడు. ఈతఁడు బేలూరిలో నొకచెరువును ద్రవ్వించుటకై రాజధనాగారముననుండి పండ్రెండువేల పొన్నులను దీసికొని యొకమిండజంగమున కొసఁగెను. అది రాజు విని పద్మరసును బిలిపించి యడిగెను. చెరువు సర్వంసిద్ధ మయ్యెను వచ్చి చూడవచ్చునని పద్మర సనెను. రాజును బిలుచుకొనిపోయి చూపెను. ఆ చెర్వునకుఁ బిట్టసముద్రమని పేరు. ఈ చెరువును గల్పించుట చేతనే యీతనికిఁ గెరెయ పద్మరసని పేరయ్యెను. కెరె యనఁగాఁ గన్నడమునఁ జెఱువు.