పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

59

పండితారాధ్యుఁడు (శివతత్త్వసారమును) బసవేశ్వరాదులు లింగైక్య మందిన పిదప శ్రీశైలమునకుఁజేరి తానును లింగైక్య మందఁబోవుచుఁ గడకాలమున రచియించెను. తద్రచనాకాలమునకు మాదిరాజయ్యయు లింగైక్య మందెనని యెఱుఁగనగును. మాదిరాజయ్య కృతిగాఁ గన్నడమునఁ గొన్నిరచనములు గలవట! కెరెయ పద్మరసున కీతఁడు పితామహుఁడట.

మఱియుఁ గిన్నరబ్రహ్మయ్య (పు. 142) కన్నడ బ్రహ్మయ్య, ముసిఁడి చౌడయ్య, సురియచౌఁడయ్య, తెలుఁగు జొమ్మయ్య, శివనాగుమయ్య యనువారు బసవనసమకాలమువారు. వీరినిగూడ మల్లికార్జున పండితారాధ్యుఁడు శివతత్త్వసారమున స్మరించినాఁడు. కలకేతబ్రహ్మయ్య, మోళిగమారయ్య, ఏకాంతరామయ్య, కక్కయ్య, భోగయ్య, గుడ్డవ్వ, జగదేవదండనాయకుఁడు, పదుమరసు, పురాణదమాయిభట్టు, అల్లయ్య, మధుపయ్య, మొదలగువారింకను బసవన్న సమకాలమువారు గలరు. వారిని గూర్చి పుట. 229లో చూడఁదగును. మల్లికార్జున పండితారాధ్యుఁడు శివతత్త్వసారమున వీరినిఁబేర్కొనలేదు. ఇందీక్రిందివానిని గూర్చి యించుక చరిత్ర మెఱుక కందుచున్నది.

మోళిగ మారయ్య

నేఁటి బందరుదేశమందలి మాండవ్యపురమును [1]పాలించుచు శివభక్తుల నారాధించుచు నుండెను. బసవన్న యతనియొద్ద నున్న శివభక్తులను దనతోఁ బిలుచుకొనిపోఁగా అతనిని జంపుట కిద్దఱు సేవకులను బంపెను. వారు జంగమవేషమును వేసికొని బసవనియింటియందు శివభక్తులనడుమఁ గూర్చుండిరి. బసవని మహిమచే వారిమెడలందున్న వంగకాయలు లింగకాయ లయినవి. ఇది విని మారయ్య వైరాగ్యమున నిట్లు పాడెను.

  1. గోదావరి మండలమందు గల యీ మాండవ్యపుర మేదో?

    శా॥ శ్రీమద్రాజమహేంద్రనామనగరీ శ్రీదుర్గవర్యస్థితా
          సామాన్యస్ఫురమాణ దక్షపురపశ్చాద్భాగతుల్యానదీ
          గ్రామణ్యంతిక పూర్వదిక్పథితతీరప్రాంత దివ్యోదిత
          శ్రీమాండవ్య పురీవరం బలరె ధాత్రీనూతనస్వర్గమై.

                               

    -శ్రీ గుణరత్నకోశము.