పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

బసవపురాణము


సిద్ధరామయ్య (పు. 48)

బసవపురాణ మీతఁడు సొన్నలిక పురవాస్తవ్యుఁ డనియు, నభినవ శ్రీగిరియని యాగ్రామమును బెంపొందించి శ్రీశైలమల్లికార్జును నక్కడికిఁ గొని వచ్చి ప్రతిష్ఠించి యింకను బెక్కుశివలింగముల నెలకొల్పి మేనినీడయు, నడుగుజాడయుఁ గానరాకుండఁ జరించువాఁడనియు, సమాధియోగమున శివలోకమునకుఁ బోయివచ్చుచుండువాఁ డనియుఁ జెప్పుచున్నది. ఆ గ్రామమున నాతఁ డొకతటాకము ద్రవ్వించి విద్యాసముద్రుఁడని బిరుదుగల కర్పరుఁడనుయోగి నోడించి తాను గట్టుకొన్న యా తటాకము నడుమను సమాధిని గల్పించుకొని యందే బయలయ్యె నట. నిజజననమును సుగ్గళవ్వకు రేవణసిద్ధుఁడు సూచించినట్టును, చెన్నబసవన్నకడ లింగదీక్షను, దత్త్వోపదేశమును బొందినట్లును గొన్ని వీరశైవగ్రంథములు చెప్పుచున్నవి.

యోగినాథవచనములు, మిశ్రస్తోత్రత్రివిధి, సిద్దరామేశ్వరత్రివిధి, అష్టావరణస్తోత్రత్రివిధి, మంత్రగోప్యము, కాలజ్ఞానము, అను గ్రంథముల నీతఁడు కన్నడమున రచియించెను. రాఘవాంకకవి (క్రీ. 1165) ఈతని చరిత్రమును సిద్ధరామపురాణ మనుపేర రచించెను.

సకలేశ్వరు మాదిరాజయ్య (పు. 89)

ఈయన శ్రీపర్వతమున వసించు శివయోగీంద్రుఁడు. ఏడువందలయేం డ్లీతఁడు శివానుగ్రహమున జీవించెనట. బసవనను జూచునాఁటి కీతఁ డార్నూఁట యేఁబది యేండ్లవాఁడట! మల్లికార్జున పండితారాధ్యుఁ డీతని నిట్లు ప్రస్తుతించినాడు.

క. భూతలమున నిది యెంతయు
    నూతనమని పొగడ నేడునూఱేండ్లు మనం
    డే తనరుభక్తిఁద్రిపురా
    రాతీ, సకలేశు మాదిరాజయ్య శివా!

ఈ మాదిరాజయ్య కళ్యాణకటకమును శపించి బసవేశ్వరుఁడు వీడివచ్చునప్పు డాతనితోడ నుండినట్లు బసవపురాణమునఁ గలదు. మల్లికార్జున