పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

బసవపురాణము

అల్లమప్రభువను శైవాచార్యుఁ డొకనాఁడు బసవనియింటికి వచ్చెను. బసవన యామహనీయునకు విందువెట్టెను. ఆతఁడు బసవనికి బెక్కువరము లొసఁగెను. అప్పటనుండి బసవన యనేకాద్భుతకృత్యములఁ జేయఁజొచ్చెను.

ఒకనాఁడు దొంగఱికము చేయుటకయి కొందఱు దొంగలు భక్తులువోలె వంగకాయలు లింగములుగాఁ గట్టుకొని బసవనయింటి కరుదెంచిరి. బసవనచూచి వారిని గుర్తించి దయచేయుఁడని యాహ్వానించి "లింగభక్తులు గానివారు నా యిల్లు సొరరాదుగాన మీరు మాహేశ్వరులే. లింగార్చనలు సేయుఁ”డని వేఁడెను. దొంగలు జడిసి కూర్చుండిరి. బసవన వారికి వాంఛితార్థ మొసఁగెను. వారి మెడలోని వంగకాయలు నిజముగా లింగములయ్యెను.

ఒక భక్తుఁడు బసవనికడకువచ్చి నిత్యలింగార్చనమున మ్రుగ్గువెట్టుటకు గాను పదిపుట్లముత్తెములు కావలెననఁగా బసవన చూచిన మాత్రనే జొన్నలరాశి ముత్యములుగా మాఱెను. దాని నాభక్తున కొసఁగెను. ఈ విధముగా నెడలేక శివభక్తుల కాతఁడు దానము సేయుచుండుట నెఱిఁగి సంగయదేవుఁ డొకనాఁడు జంగమరూపమునవచ్చి 'నాకు మూఁడవక న్నొసఁగు' మనికోరెను. లింగపసాయితమను ఖడ్గమును బూని 'నీమాయ నేనెఱుఁగనా? యిదె చూచుకొమ్మ'ని యుద్ధమున నాయనకు ముక్కన్నుఁ జూపెను. లజ్జించి సంగయదేవుఁడు మాయమయ్యెను. 'ఇసీ! పాఱిపోయితివా? వారు వీరు వలె నిన్ను, నేను వర మడుగువాఁడ ననుకొంటివా? నీ భక్తు లారగింపఁగా మిగిలిన ప్రసాదమే కలకాలము నాకుఁ గలదు. నీకేమైన వలయునేని కోరుము; నేనొసఁగెదను. మాట తప్పువాఁడనుగాను; నీయాన! నీ ప్రమథులయాన!” యని గద్దించి యాదేవు నోడించి బసవన గెలిచెను.

ఒకనాఁడు బిజ్జలునికొల్వునఁ గూర్చుండి వ్యవహారము నడపుచు బసవన నడుమ నసందర్భముగా "వెఱవకు వెఱవకు ” మనుచుఁ గడువఁబైకెత్తువిధమునఁ జేతులు పైకెత్తెను. బిజ్జలుఁడు నవ్వి! 'ఏమయా నీకు భక్తిరసము తలకెక్కెనా? శైవపుఁబిచ్చి యెత్తెనా? అదియేమి అట్లసందర్భముగా మాటాడితివి? చేతు లెత్తితివి?'