పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

37

 యత్నించెను. భక్తివేఱు, బ్రాహ్మ్యమువేఱు గావున భక్తుఁడగు తనకు బ్రాహ్మ్య మక్కఱలేదని చెప్పి తండ్రితో వాదించి బసవన యుపనయనము చేసికొనఁ డయ్యెను. తల్లిదండ్రులతో వేర్పడి తనసహోదరి నాగమాంబతో నాతఁ డిల్లువీడి వెలికిఁజేరెను. మాదాంబసోదరుఁడును, కళ్యాణకటకము నేలుచున్న బిజ్జలుని దండనాయకుఁడును నగు బలదేవుఁడు వారి నాదరించెను. భవికిఁ బుత్త్రిక నీయనని పూనిక గల్గియున్నవాఁడు గావున నాబలదేవదండనాయకుఁడు తనకూఁతురగు గంగాంబను బసవని కిచ్చి పెండ్లిచేసెను. ఆ వింతపెండ్లికి లోకు లాశ్చర్యమందిరి. పిదప బసవన్న, గంగాంబ, నాగాంబ మువ్వురును గూడలిసంగమేశ్వరుని దర్శింప నేఁగిరి. సంగయ దేవుఁడు మునుపటి విధమునఁ దాపసవేషముతో గుడిముందు ప్రత్యక్షమయ్యెను. బసవన యారాధించెను. శివభక్తులదుశ్చరిత్రములు మేలుగానే గ్రహింపుమనియు, శత్రులయినను లింగవంతులను మిత్రులనుగానే చూడుమనియు ప్రాణాపాయము వచ్చినను బూనినవ్రతము విడువకుమనియు, భక్తులజాతుల విచారింపకుమనియు, శివద్వేషులను జంపుమనియు, వేదశాస్త్రార్థసంపాదితమైన భక్తిని లోకమున నెలకొల్పుమనియు, - ఇత్యాది విధముల సంగయదేవుఁడు బసవనికి హితోపదేశము చేసి గుడిసొచ్చి యంతర్ధానమయ్యెను. భక్తులెల్లరు నబ్రమంది బసవనను బ్రస్తుతించిరి.

బలదేవదండనాయకుఁడు శివలోకమున కేఁగెను. ఆతని దండనాయక పదమును బిజ్జలుఁడు బసవని కొసఁగెను. బసవన కళ్యాణ కటకమునకుఁ జేరెను. ఆతని యాదరువున నసంఖ్యాకులుగా శివభక్తులు కళ్యాణమునకుఁ జేరుచుండిరి. అప్పుడు కళ్యాణముననున్న శివభక్తుల సంఖ్య లక్షయు నెనుబదివేలని పండితారాధ్యచరితమందు గలదు. మిండజంగములే పండ్రెండువే లుండెడువారట! ఇందఱకును బసవన యీప్సితార్థములు సంఘటించుచుండెడివాఁడు. బసవనసోదరియగు నాగాంబకుఁ జెన్నబసవన్న యని కొడుకు గల్గెను. ఆతఁడు బసవన తర్వాత బసవన యంతవాఁడు. మేనమామ నాతఁడెంతయుఁ నారాధించుచు శిష్యుఁడై యాతని యాజ్ఞలో మెలఁగుచుండెను.