పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

19

పండితారాధ్యచరిత్రము - ఇందు మల్లికార్జున పండితారాధ్యుని చరిత్రము వర్ణితమయినది. ఇది బసవపురాణమువంటి ద్విపదకృతి. గ్రంథస్వరూపమునందును, కవితాగౌరవమునందును బసవపురాణముకంటె గొప్పది. బసవపురాణమునఁ జెప్పఁబడని శివభక్తుల కథలిందు గలవు. అందుఁ జెప్పఁబడనిది బసవేశ్వరచరిత్ర మిందుఁ గొంత గలదు. గురురాజకవి దీనిని సంస్కృత భాషలోనికిఁ బరివర్తించినాఁడు. అది కొంత ముద్రిత మయినది. శ్రీనాథకవిసార్వభౌముఁడు దీనిని బద్యప్రబంధముగా రచియించినాఁడు. అది నేఁడు గానరాకున్నది.

చతుర్వేదసారము - ఇందు శివపారమ్యము ప్రతిపాదితమయినది. పండితారాధ్యచరిత్రమునను, సోమనాథభాష్యమునను జెప్పఁబడిన యుక్తులే, ఉదాహృతములయిన శ్రుతిస్మృతిపురాణాదులే యిందును సీసపద్యములలోఁ జక్కఁగాఁ బొందికగాఁ జెప్పఁబడినవి. నాలుగువందల సీసపద్యములిందు గలవు. ప్రతిపద్యమును బసవసంబోధనముతో ముగియుచున్నది. పండితారాధ్యచరిత్రమున నీ కృతి పేర్కొనఁబడినది.

అనుభవసారము - ఇది చిన్న పద్యకృతి: గురుభక్తిమహిమ, శివపూజావిధానము, భక్తలక్షణము, జంగమసేవ, ఇష్టలింగార్పణము, షట్‌స్థలవివరణము మొదలగు శైవధర్మము లిందుఁ దెలుపఁబడినవి.

చెన్నమల్లు సీసములు- ముప్పదిరెండు సీసపద్యములు. షట్‌స్థలవైభవ మిందుఁ బ్రశంసింపఁబడినది. 'చెన్నమల్లు' అను మకుటముతో నీ సీసపద్యములు ముగియుచున్నవి.

వృషాధిపశతకము- "బసవా బసవా బసవా వృషాధిపా” అనుమకుటముతో నిందుఁ బ్రతిపద్యమును ముగియుచున్నది. ఈ వృత్తశతకమున బసవపురాణకథాసారమెల్లఁ గలదు. బసవేశ్వరప్రస్తుతి గలదు. పెక్కుపద్యములు శబ్దచిత్రము గలవి. సంస్కృత ద్రవిడ మణిప్రవాళ కర్ణాట మహారాష్ట్ర భాషల పద్యములు గూడ నిందుఁ గలవు.

ఇవి ముద్రితములైన యాంధ్రగ్రంథములు.