పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

బసవపురాణము

నాది ప్రచారమునకుఁ దెచ్చినవాఁడు, తచ్చిష్యపరంపరలోనివాఁడు నగు పిడుపర్తి బసవన్న యాగ్రంథమును బేర్కొనలేదు.

కర్ణాటకమున సోమేశ్వరశతక మొకటి యీతనికృతిగాఁ జెప్పఁబడునది గలదు. దోషభూయిష్ఠమగు నా శతకము పాల్కురికి సోమనాథుని కృతిగా విశ్వసింపఁజాలమని కర్ణాటవిద్వాంసు లనుచున్నారు. కర్ణాటకవిచరిత్రకారులును నా శతకము సోమనాథుని రచన మగుటనుగూర్చి సంశయించిరి. అష్టకములను పంచకములనుగూడఁ బరిగణించిన పిడుపర్తి బసవన యీ శతకము సోమనాథుని రచనమే యగునేని పేర్కొనక విడువఁడు. “సోమేశ్వరా” యని సంబోధనము మకుటముగాఁగల యా శతకము సోమనాథుని శిష్యపరంపరలోనివాఁ డితరుఁడు రచియించినదయి యుండవచ్చును. సోమనాథునిఁ బ్రస్తుతించునది అన్యవాదకోలాహలమని నామాంతరముగల సోమనాథలింగ శతకము గలదు. అదికూడఁ గర్తృనామరహితమే. కొందఱు దానిని గూడ సోమనాథునికృతినిగాఁ దలంచిరి.[1] అది పొరఁబాటు. మఱియుఁ గర్ణాటకవి చరిత్రమున నీతఁడు 'సహస్రగణనామములు'. 'శీలసంపాదనము' అను కర్ణాటగ్రంథములనుగూడ రచియించినట్లు వ్రాయఁబడెను. పండితారాధ్యచరిత్రలో సోమనాథుఁడు గణసహస్రనామస్తవముఁ జేర్చెను. కర్ణాటకవులు దానిని బేర్కొనుటనుబట్టి కర్ణాటకవిచరిత్రకారు లా గ్రంథము వేఱుగాఁ గర్ణాటమున రచితమైన ట్లూహించిరి. మఱియుఁ గన్నడకవిచరిత్ర మిట్లు చెప్పుచున్నది: "భైరవేశ్వరకావ్యపుఁ గథాసూత్రరత్నాకరమున నిట్లు గలదు. సోమనాథుఁడు జ్యోతిర్మయ శాంభవీజ్ఞాన దీక్షాబోధలోని పరమరహస్యార్ధమును సంగయ్య యను శరణునికి నూటయఱువది వచనములలో సంగ్రహించి యుపదేశించెను” దీని యాథాథ్యము మన కెఱుఁగరాదు.

కృతుల వివరణము

బసవపురాణము - ఇఁకముందు దీనిఁ గూర్చి విపులముగా వివరణ ముండును.

  1. కర్ణాటకవి చరిత్ర, దానిని బట్టి కం. వీరేశలింగము పంతులుగారును