పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

17


     రగడ, గంగోత్పత్తిరగడ, శ్రీబసవాఢ్య
               రగడయు, సద్గురురగడ, చెన్న
     మల్లు సీసములు, నమస్కారగద్య, వృ
               షాధిపశతకంబు, నక్షరాంక

గీ. గద్యపద్యముల్, పంచప్రకారగద్య
    యష్టకము, పంచకము, నుదాహరణయుగము
    నాది యగు కృతుల్ భక్తహితార్థబుద్ధి
    జెప్పె నవి భక్తసభలలోఁజెల్లుచుండు.”

ఇందు బసవపురాణము, పండితారాధ్యచరితము, అనుభవసారము, చతుర్వేదసారము, చెన్నుమల్లు సీసములు, వృషాధిపశతకము, (ఒక) బసవోదాహరణము అనునవి తెల్గుకృతులు. సోమనాథభాష్యము (దీనికే బసవరాజీయ మని మాఱుపేరు), రుద్రభాష్యము, అష్టకము, పంచకము, నమస్కారగద్య, అక్షరాంకగద్య, పంచప్రకారగద్య, (ఒక) బసవోదాహరణము, సంస్కృతభాషలో నున్నవి. కడమవి కన్నడమున నున్నవి. వీనిలో రుద్రభాష్య మిప్పుడు గానరాకున్నది. 'సోమనాథస్తవమని మఱియొక ద్విపదస్తవము తెలుగుభాషలోనే యీ కవివరుని దొకటి గలదు” అని శ్రీ బండారు తమ్మయ్యగారు వ్రాసిరి. అది యోరుఁగంటిలో ముదిగొండ శంకరారాధ్యులవారిచేఁ బరిష్కృతమై ముద్రితమైన 'మోక్షపాయ' మను పుస్తకమునఁగల సోమనాథస్తవమే యగునేని దానికిఁ గర్త పాల్కురికి సోమనాథుఁడనుట నిరాధారము. దాని ముగిం పిట్లున్నది :

“భక్తుల సంగంబు భక్తసద్గోష్ఠి
  భక్తుల పదసేవ పదపడి చేయ
  కరుణ నొసంగవే కైలాసవాస
  గురునాథ శ్రీపాలకురికి సోమేశ !”

తద్రచనము సోమనాథుని రచనమువలె లేదు. తమ్మయ్యగారు పేర్కొన్న సోమనాథస్తవ మింకొకటి కలదేమో! సోమనాథుని గ్రంథములనెల్లఁ బఠనపాఠ