పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

7

ఆఱు పురుషాంతరములకుఁ దర్వాతివాఁడగు పిడుపర్తి బసవన్న గ్రంథము సోమనాథుని గ్రంథములకంటెను దత్సమకాలమువారి గ్రంథముల కంటెను బ్రబలప్రమాణము కాఁజాలదు. బహుకాలమునకుఁబిదప బసవన్న వినికిళ్లను బట్టి వ్రాసిన వ్రాతలలోఁ గొన్నితప్పులు దొరలవచ్చును. సోమనాథుఁడు క్రీ. 1190 ప్రాంతములవాఁడనుటయే సిద్ధాంతముగా నిశ్చయింపవలెను.

బసవపురాణ రచనాకాలము

బసవపురాణమున బిజ్జలుఁడు మృతుఁడైన తర్వాత నాతని కుమారులు రాజ్యముకొఱకు యుద్ధముచేసి వారును జనిపోయిరని కలదు.

“అంత రాజ్యార్ధమై యనిసేసి యతని, సంతానమెల్ల నిస్సంతానమయ్యె
వీఁకఁ గొట్టములలో వెలిఁగె గుఱ్ఱములు, తోఁకల నిప్పులు దొరుగనక్షణమ
కరులును గరులును గన్నంతనెదిరి, పొరిఁబొరిఁదాఁకి జర్జరితమై పడియె
బ్రమసి యమాత్యాదిభటవర్గమెల్లఁ, దమలోనఁజచ్చిరి సమరంబు సేసి
బసవని సత్య శాపమునఁగాఁజేసి, పసచెడి కటకంబు పాడయ్యెనంత.”

- బసవపురాణము

బిజ్జలునికి సోవిదేవుఁడు, సంకమ, వీరనారాయణుఁడు, సింగణుఁడుఁ, వజ్రదేవుఁడు అనువారు కుమాళ్లుండిరి. బిజ్జలుని (క్రీ. 1167) తర్వాత పదునాఱేండ్లకే (క్రీ. 1183) వీరెల్లరు రాజ్యభ్రష్టులై చనిపోయిరి. వీరిలో సోవిదేవుఁడు పదియేండ్లును, సంకమ నాల్గేండ్లును, వీరనారాయణుఁడు, సింగణుఁడు, మూఁడేండ్లును, రాజ్యము చిన్నభిన్నములగుచుఁ జిన్నదగుచునుండఁగాఁ బరిపాలనము చేసిరి. క్రీ. 1183 నాఁటికి రాజ్యము పూర్తిగా నన్యాక్రాంతమయినది. సోమనాథుఁడీ విషయమును బేర్కొన్నాఁడు గాన, బసవపురాణ రచనము క్రీ.1183 కుఁదర్వాతిదగుట స్పష్టము.

పిడుపర్తి బసవన ఓరుఁగంటిలో భక్తులు బసవపురాణముఁ జదువు చుండఁగాఁ బ్రతాపరుద్రుఁడు వచ్చి వినెనని వ్రాసినవ్రాఁత ప్రతాపరుద్రునిఁగూర్చి కాక రుద్రదేవునిఁగూర్చి కావచ్చును. రుద్రదేవుఁడు క్రీ. 1198 దాఁక రాజ్యమేలినాఁడు గావున నా కథ యప్పుడు జరిగియుండవచ్చును. సోమనాథుఁడు రుద్రదేవునే ప్రతాపరుద్రుఁడని భేదము తెలియక చెప్పియుండవచ్చును.