పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

బసవపురాణము

ఆ కథ జరగినదే యగునేని బసవపురాణము క్రీ. 1183 కుఁ దర్వాత 1198కిఁబూర్వము రచితమగును. ఇంచుమించుగా క్రీ. 1190 బసవపురాణ రచనాకాలమని నిర్ణయింపవచ్చును.

సోమనాథుని నెలవు

సోమనాథుని యింటిపేరు పాలుకురికి, పాల్కురికి, పాలకురికి అని మూఁడు రూపములును గానవచ్చుచున్నవి. ఈతఁడు నివసించిన గ్రామము పాల్కురికి యగును. అన్యవాదకోలాహలమని సోమనాథునిపేరనే "సోమనాథలింగ” యను సంబోధనముతో సీసశతకమును రచియించిన శివుఁడొకఁ డితఁడు పాల్కురికి గ్రామవాస్తవ్యుఁడని చెప్పెను. పాల్కురికి గ్రామము నేఁటి నైజాము రాష్ట్రమున నోరుఁగల్లు మండలమునఁగలదట! సోమనాథుఁడు సిద్ధిపొందిన పిదప నాతని సమాధిపై 'సోమనాథలింగ' మని శివలింగము ప్రతిష్ఠితమయ్యెనని కొందఱందురు. పాల్కురికిలో సోమనాథలింగము గలదేమోకాని యది యీ సోమనాథుని యనంతరమాతని సమాధిపైఁ బ్రతిష్ఠితమయ్యెనని కొందఱందురు. పాల్కురికిలో సోమనాథలింగము గలదేమోకాని యది యీ సోమనాథుని యనంతర మాతని సమాధిపైఁ బ్రతిష్ఠిత మయ్యెననుట విశ్వాస్యము గాదు. సోమనాథుఁడు సమాధిలో బయలయినది పాల్కురికి గ్రామమునఁగాదు. కర్ణాటదేశమున శివగంగాక్షేత్రము చేరువనుగల కలికెమను గ్రామమున నాతఁడు సమాధిస్థితుఁ డయ్యెను. పిడుపర్తి బసవన బసవపురాణము, పాల్కురికి సోమనాథపురాణము, కర్ణాటకవిచరిత్రము, మొదలగు గ్రంథము లీ విషయమును రాద్ధాంతపఱుచుచున్నవి.[1]

పాల్కురికి గ్రామమున జనించుటచే సోమనాథున కాయూరి లింగమూర్తి పేరే తల్లిదండ్రులు పెట్టియుండవచ్చును. అక్కడ సోమనాథదేవాలయము, సోమనాథుని పుట్టుకకుఁ బూర్వముననే వెలసియుండవచ్చును.

  1. పిడుపర్తి బసవన బసవపురాణమున నీ విషయము గానరాదని కొందఱనవచ్చును. అందు “కలిమలభంగచంగ శివగంగకుఁ జెంగటఁ గల్కె మన్పురిన్” అని యుండవలసినచోట నచ్చుతప్పు- "శివగంగకుఁ జెంగటఁ గల్గు మత్పురిన్” అని పడినది.