పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

బసవపురాణము

దినములకుముందు కప్పడిసంగమేశ్వరమున బసవేశ్వరుఁడు లింగైక్యమందెనన్న వార్త వినవచ్చినట్లును, బసవేశ్వరనిర్యాణమునకుఁ బండితారాధ్యుఁడు మిక్కిలి విలపించినట్లును, వనిపురము శంకరయ్య యను భక్తునితో నక్కడనుండియే శ్రీశైలమున కరిగినట్లును బండితారాధ్యచరిత్రమునఁ గలదు. శ్రీశైలమున కరుగునాఁటికిఁ బండితారాధ్యుఁడు కడువృద్ధుడు. శ్రీశైలము చేరిన తరువాతఁ గొలఁదిదినములకే శివరాత్రి పుణ్యదినోత్సవము జరపి పండితారాధ్యుఁడు లింగైక్యమందెను. బసవేశ్వరుఁడు లింగైక్యమందినట్లు పండితారాధ్యచరిత్రమును బట్టి గట్టిగా నిర్ణయింప నగుచున్నది. 1168లో బసవేశ్వరుఁడు లింగైక్యమందెను. 1170 కే పండితారాధ్యుఁడును లింగైక్యమంది యుండును.

ఇట్టి పండితారాధ్యులవారి శిష్యునితో సంభాషించి బసవపురాణ కథార్థముల నెఱిఁగిన పాల్కురికి సోమనాథుఁడు 1190 ప్రాంతములకంటెఁ దర్వాతివాఁడయి యుండఁడు. అది రుద్రదేవుని పరిపాలన కాలమేకదా!

మఱియుఁ బండితారాధ్యులవారు లింగైక్యక మందినపిదప వారి శిష్యుఁడైన దోనమయ్య, వారి ప్రథమపుత్రుఁడైన కేదారయ్యకు లోకారాధ్యపట్టమును గట్టి తా ననర్గళముగా భక్తి రాజ్యమేలుచున్నట్టును, గేదారయ్యయు నలుగురు పుత్రులఁ గాంచి వంశాభివృద్ధితో నున్నట్లును బండితారాధ్యచరిత్రమునఁ గలదు. పాల్కురికి సోమనాథుని పండితారాధ్యచరిత్ర రచనాకాలమునకుఁ బండితారాధ్యులవారి శిష్యుఁడును బుత్రుఁడును, సజీవులై యున్నారని, మనుమలు పేర్వెలయుచున్నారని దీనివలన నేర్పడుచున్నది. సోమనాథుని గ్రంథములలోఁ బండితారాధ్యచరిత్రము కడపటిది. ఈ సాధనమునుబట్టి చూచినను బండితారాధ్యుల లింగైక్యమునకుఁదర్వాత నిర్వది ముప్పదియేండ్లకే రుద్రదేవుని పాలనకాలముననే (ఇంచుమించుగా 1190) సోమనాథుఁడు ప్రసిద్ధ గ్రంథకర్త యయి యున్నట్టు స్పష్టమగుచున్నది.

సోమనాథుని కాలనిర్ణయమున కింకను గొన్ని సాధనములు గలవు. అవి డొంకతిరుగుడుగా నీ కాలమునకే చేరునవిగా నుండుటచే విడనాడినాడను.