పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

బసవపురాణము

సవిశేషజంగమార్చనపరతంత్రుఁ - డవికలవిధినిషేధవివర్జితుండు
ప్రవిమలాంగుఁడు నిష్ప్రపంచగుణాఢ్యుఁ - డవిరళతత్వానుభవసుఖాంభోధి
కర్మాపహరుఁడు లింగప్రాణమథన - మర్మజ్ఞుఁడన లసన్మహిమఁబెంపారి
యనయంబు నతులఘోరాటవికేఁగి - ఘనతరంబుగ మోచి కట్టెలు దెచ్చి
యంగడి విక్రయం [1]బార్చి తెప్పించి - జంగమారాధన సలుపుచునుండు
రసరసాయనములు బసవని నగర - నసలార భోగించి యాదటఁ[2]బోక
జంగమకోటి నిచ్చలు నొక్కమాటు - భంగిగా నారగింపఁగఁబెట్ట వచ్చి
“బసవ! మారని యట్టిభక్తులు గలరె? - వసుధలో నీ యింటిరసరసాయనము
లతనినగరఁగాంచు నంబకళంబు - ప్రతివచ్చునే యెన్ని భంగులనైన
ననిశంబు నతనికాయకలబ్ధి యెంత - సంతుష్టి సేయు టాశ్చర్యంబు గాదె?
బాపుఁ మోళిగమార! భక్తివిస్తార - బాపురే” యని మ్రోలఁబ్రస్తుతి సేయ
నసలార విస్మితుం డగుచు నేతెంచి - బసవఁడు ప్రచ్ఛన్నభావంబు నొంది
మోళిగ మారయ్య ముద్దియఁగాంచి - లాలితోద్యత్సముల్లాస మెలర్ప
'శరణార్థి' యని చక్కఁజాఁగి మ్రొక్కుడును - దరుణియునటమున్న 'శరణార్థి' యనుచు
నడుగుల కర్ఘ్యపణ్యంబులు దేర - నొడఁబడ కెఱిఁగెదరో యనుమతిని
“అమ్మమ్మ! మాలింగ మాకొన్నవాఁడు - క్రమ్మన వడ్డింపు రమ్ము లె” మ్మనుచు
సరసర లింగావసరము సెల్లించి - పరికించి యం దొక్కవడిగంబు క్రింద
విడియలతో రెండువేలమాడలును - [3]నడకి యమ్మకు శరణార్థి సేయుచును
సదమలలింగప్రసాదంబు గొనుచు - విదితముత్పులక సముదితాత్ముఁడగుచు
ధర నిరుపేద నిధానంబుఁగన్న - కరణిని హర్షాశ్రుకణములు దొరుగ
“నిదిగదా భవదుఃఖగదకు(ము?) నౌషధము; - ఇదిగదా భక్తిమహిష్ఠతపంట;
ఇదిగదా నా పుట్టినింటికల్పకము! - ఇదిగదా ముక్తికి నిక్క దాననుచుఁ
బొంగి ప్రసాదైకభోగియై తద్గృ - హాంగణంబున నిల్చి యాత్మలోపలను
నీ సదనం బంత నింతఁగన్నంత - దోసంబులెల్ల విధూతము ల్గావె
యీ నగరద్వార మిఱియ నేతెంచు - నా నరుఁడపుడ కృతార్థుండు గాఁడె
యీ సీమలోఁజరియించు జంతువులు - చేసిన భాగ్యంబు సెప్పంగఁదరమె
యీ గృహాంతరరేణు విసుమంత నొసల - [4]బాగొందు నతనికి భక్తి వర్ధిల్లదె?

  1. బార్చినలబ్ధి
  2. లేక
  3. నడికి
  4. బాగొందఁబూసిన