పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

బసవపురాణము

ఇతని నిర్మాల్యసంగతిఁజేసికాదె - రతిపతిహరుఁడు నిర్మలదేహుఁడయ్యె
ఇతనిగండూషాంబు కృతసేవఁగాదె - జితపురత్రయదైత్యుఁడతిలోకుఁడయ్యె
ఇతనిప్రసాదవిహితభుక్తిగాదె - క్షితిధరకన్యకాపతి నిత్యుఁడయ్యె
ఈ దేవుఁడితని ప్రసాదంబుఁగుడిచి - వేదశాస్త్రముల వివేకంబు గడఁచె
శివుఁడు గన్నప్పయుచ్చిష్టంబుఁగుడిచి - యవికలవిధి నిషేధాతీతుఁడయ్యె
లింగంబు గన్నప్ప యెంగిలిగాన - యంగమంతయు నుత్తమాంగమై యొప్పె
గణనాథుచేత లింగసమేతుఁడయ్యె - గణుతింప నంబిచే ఘనభక్తుఁడయ్యె
సన్నుతికెక్కి మా కన్నప్పచేత - సన్నుతసర్వప్రసాదాంగుఁడయ్యె
ననుచు భక్తానీక మసమానలీల - వినుతింప జగములు విస్మయంబంద
నన్నగజా [1]ధీశుఁ డంత నందంద - కన్నప్ప దేవునిఁగౌఁగిటఁజేర్చి
పరగుచతుర్వర్గ[2]ఫలము లాదిగను - వరమిత్తు నడుగుము వాంఛితార్థమ్ము”
లనవుడుమందస్మితాననుండగుచు - [3]ననురక్తిముకుళితహస్తుఁడై మ్రొక్కి
"యెఱుఁగమోక్షములపేరెఱుఁగవాంఛితము - లెఱుఁగవేఁడెడుమార్గమెఱుఁగనేమియును
ఎఱుఁగుదు నెఱుఁగుదు నెఱుఁగుదు మఱియు - మఱియును మఱియు ముమ్మాటికినిన్ను
కావునఁ గోరిక కడమయుఁ[4] గలదె? - దేవ! మూలస్తంభ దివ్యలింగాంగ!
నీ యతులిత దయాన్వితదృష్టి - నా యందు నాఁటి కొనలు [5]వసరింప
నా దగు సంస్పృహాపాదితదృష్టి యిట్లు - నీ దృష్టిలోనన నెక్కొని పొదలఁ
గరుణింపు దక్కిన వరము లేనొల్లఁ - బరమాత్మ!” యని విన్నపంబాచరింప
నభిమతార్థప్రదుఁడట్ల కన్నప్ప - కభిముఖుఁడై నిల్వనంత నిద్దఱును
వెలయఁ దా రన్యోన్యవీక్షణానంద - కలితాత్ములై తిరుకాళ[6] త్తిపురిని
గన్నప్పదేవుఁడు గౌరీశ్వరుండు - సన్నిరీక్షణలీల నున్న వారిపుడు
నిక్కంబు గన్నప్ప పుక్కిటినీరు - ముక్కంటి కభిషేకమున కెల్లవ్రొద్దు
నేఁడును గన్నప్ప నిర్మాల్యమందుఁ - బోఁడిగా శివునకుఁ బూజసేయుదురు
మృడుఁడు గన్నప్ప కర్పించినఁగాని - యడరంగ నేఁడును నారగింపండు
కన్నర్పితము సేసెఁ గాన లోకములఁ - గన్నప్పఁ డనఁగ మహోన్నతి కెక్కె
నచ్చట నేఁడు గన్నప్పండు శివుఁడు - నచ్చెరువందంగ నట్లున్నవాఁడు
కావునఁ దొల్లి ముగ్ధస్వభావులకు - దేవుండు కృపసేయుఁదెల్ల మి”ట్లనుచు
బసవయ్య ముగ్ధగణసమూహి కథలు - పసరింప నా చెన్నబసవయ్య వినఁగఁ

  1. ధిపు
  2. పదము
  3. ననురక్తి
  4. లేదు
  5. బ్రసరింప
  6. హస్తిపురిఁ