పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

87

కన్నులు గన్నప్ప కన్నులై యిట్లు - సన్నుతి గడచి సమున్నత స్ఫురణ
నాల్గుఁ గన్నప్ప నైనారినేత్రములొ? - నాల్గు నీశ్వరునయనంబులో యనఁగ
మృడుని మూఁడవ కంటిక్రింద నిర్గడల - నడర రెండును రెండునై మించి వెలుఁగఁ
జూపును జూచు తద్రూపును(పము)దారు - నేపారఁ ద్రివిధంబు నేకమై యునికిఁ
దమ నేత్రములఁ దమ్ముదార వీక్షించు - క్రమమయ్యె శివునికిఁ గన్నప్పనికిని
నెఱి నాల్గు గన్నుల నిజదీప్తినంత - పఱగప్పి నట్లుండె ఫాలలోచనము
కాలునే యింక నీ కంటఁ జూచినను - నోలిఁబురత్రయంబొండు గల్గినను
గాలునే యింక నీ కంట జూచినను - నా లక్ష్మి నందనుండంగంబుగొన్నఁ?
గాలునే యింక నీ కంటఁ జూచినను - గాలుఁడు వెండియుఁ గ్రమము దప్పినను?
గాలునే యింక నీ కంటఁ జూచిను - నే లోకమును నంత్యకాలంబునాఁడు?
కన్నప్ప సదయాంబకము మున్నుశివుని - కున్న నట్లునుగాక యుగ్రాక్షుఁడండ్రె?
[1]నాఁడ యీ కన్నప్ప నయనముండినను - వేఁడునే సిరియాలు విందారగింప?
నాఁడ యీ కన్నప్ప నయనముండినను - బోఁడిగా సైఁచెనే భ్రూణహత్యకును
ఈ చారునేత్రాబ్జ మీశునకున్నఁ - జూచునే నిమ్మవ్వసుతుచావు నాఁడు?
పంబి యీయమృతాంబకం బున్నశివుడు - నంబి కన్నులుసెడ నాఁడేల చూచు?
ఈ నేత్రమున్న మున్నీశుండుబాలుఁ - బోనిచ్చునే పాముపుట్టఁ దొడ్కంగ?
ఇతని నేత్రంబున్న నిన్నియు నేల? - యతి దయాపరుఁ డన నుతికి నెక్కండె?
ఇతని నేత్రంబు మున్నీశుకున్న - నతిభూమి సౌందర్యుఁడన భువిఁ జనఁడె?
ఇట్టి నేత్రంబు మున్నెప్పుడు నున్న - నెట్టి కాంతల మెచ్చునే హరుఁ" డనఁగఁ
గన్నప్ప నేత్రంబుకతమున నీశుఁ - డెన్నంగ సర్వసంపన్నుఁడై నెగడె
కన్నప్ప పాదరక్షాస్పర్శ శివుఁడు - సన్నుతభక్తవత్సలుఁడనఁబరగె
ఈ చెప్పు నాఁడు దన్నింత సోఁకుడును - నా చంద్రుఁ డభినంద్యుఁ డయ్యె లోకముల
ఈ చెప్పు నాఁడు దన్నింతసోఁకుడును - నేచిన తీర్థమై యిల నొప్పె గంగ
ఈ చెప్పుదానయ్యెనేఁ బద్మభవుఁడు- చూచున కాదె యీశునిమస్తకంబు
శ్రీపతి గానని శ్రీమహాదేవు - శ్రీపాదభక్తుల శ్రీపాదరక్ష
పరమేష్ఠి గానని యురులింగమూర్తి - శిరమున నొప్పు విశిష్టభూషణము
చెప్పెడిదేమి? గన్నప్పపాదంబు - చెప్పు మహత్త్వంబు సెప్పఁ జిత్రంబు
ఇతని పాదోదకాయత సిద్ధిఁగాదె - సితకరమౌళి ప్రసిద్ధుఁడై పరగె

  1. ఇది కొన్ని ప్రతులలో లేదు