పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

81

నీ రమ్యమగు మా శరీరము ల్మీకు - నారగింపంగ నాహారము ల్గాఁగఁ
గరుణింపుఁ”డనుడు శ్రీకంఠుఁడిట్లనియె - "ధరఁగాళహస్తి భూధరసమీపమున
మృగములై పుట్టుఁడు మిమ్ము వధించి - బగుతుఁడొక్కఁడు పరిపక్వంబుసేసి
యర్పింపనేర్చుఁ గన్నప్పఁడనంగ - [1]నర్పింప నపుడు మిమ్మారగించెదను”
అని యానతిచ్చుడు నసురు లక్షణమ - చనుదెంచి ప్రజలును వనితలుఁదారు
మృగములై లింగసమీపంబునందుఁ - దగిలి జన్మించి యెంతయుఁబ్రీతిఁదమ్ము
నొరులకుఁ గానరాకుండ వర్తింప - వరమృగావలి సేరవచ్చిన నుబ్బి
యొక్కొక్కకోలన యొక్కొక్క మృగము - నుక్కడఁగింపుచు నుత్సవంబలరఁ
జెచ్చరఁగోలలు దెచ్చియక్షణమ - త్రచ్చి మెల్లన మంట దరికొల్పి కాల్చి
మంచి మాంసముగ శోధించి [2]శోధించి - పంచిన మాడ్కి ఖండించి ఖండించి
కాల్చుచుఁ బక్వంబుగాఁ ద్రిప్పి త్రిప్పి - ప్రేల్చుచు వెండియుఁగ్రియకొల్పికొల్పి
తవిలి ఖండింపుచుఁ దాఁజవిసూచి - చవి[3] యున్న లెస్స మాంసము దొప్పఁబెట్టి
చిఱుతయుఁగఠినంబు ఛిద్రంబుమొఱకు - కఱకును గారాకు గాకుండఁజూచి
యింపారి నునుపారి కంపు సొంపారి - పెంపారి చాల నొప్పెడు బిల్వపత్రి
నలి దీటుకొనఁగోసి తలసజ్జఁజేసి - యలరు జుంజుఱు వెండ్రుకలమీఁదఁదాల్చి
చక్కనమొగలేటి సదమలోదకము - లక్కజంబుగ రెండువుక్కిళ్లఁబట్టి
దావలికరమునఁ జాపంబు శరము - లేపార వలచేత నిట మాంసమున్న
దొప్పయుఁబట్టి కన్నప్పఁడేతెంచి - చెప్పుఁగాలనుదొంటి శివుమీఁది పూజ
పోనూకి తెచ్చిన పుక్కిటినీట - మానుగా శివునకు మజ్జనంబార్చి
పఱికివెండ్రుకలపైఁబత్తిరి రాల్చి - మఱి దొప్పఁ దెచ్చిన మాంసమర్పించి
యనయంబు నిట్లు గన్నప్పదేవుండు - ననురాగమునఁ గొల్వ, మునుగొల్చుతపసి
యేతెంచి యప్పరమేశ్వరు మ్రోల - నీ తెఱంగంతయు నేర్పడఁజూచి
యెక్కడి మ్లేచ్చుఁడో యెన్నఁటఁగోలె - నిక్కడ నన్యాయ్య మిట్లుసేసెడిని
నేమిసేయుదు నంచు నేవగింపుచును - నా మాంస ఖండంబు లటు [4]వాఱనూకి
యపవిత్రమయ్యె శివా[5]గారమనుచుఁ - దపసి పంచామృత స్నపనంబుసేసి
పాదోదకములు దత్ప్రాంతంబునందు - వేదోక్తముగఁ జల్లివెండి పూజించి
వేగుండి యాతని [6]విధమెల్ల నరసి - వేగినఁ దపసి యుద్వృత్తిమై వచ్చి
“అక్కటా! యెంగిలి యదియు మాంసంబు - పుక్కిటినీరును బూజ్యమే పూజ;

  1. నర్పించు
  2. సాధించి
  3. చూచి మంచి
  4. వోవ
  5. వాస
  6. వృత్తాంత మరసి