పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

బసవపురాణము

కొడుకుచే మ్రొక్కించుకొని గురుమూర్తి - గుడిఁజొచ్చి తొంటికైవడిన యున్నెడను
నందఱు నతివిస్మయాక్రాంతులగుచు - నిందుమౌళియ కాక యితఁడు మర్త్యుండె?
యెన్నఁడే గుడికడ [1]నీతపస్వీంద్రుఁ - గన్నవారెవ్వరుఁగలరయ్య! తొల్లి
బసవండు తనకెంత భక్తుఁడో కాక - యెసకంబుతో సంగమేశుండు దాన
వచ్చి తాపసిక్రియ మెచ్చి బోధించి - [2]చొచ్చె నగ్గుడియ తా నెచ్చనో(?) యణఁగె
అతికృతకృత్యులమౌదుమే యిట్లు - స్తుతియింపఁ గనుఁగొనఁజొప్పడె నేఁడు
[3]బాపురా! మాయన్న! బసవకుమార! - [4]బాపురా! మాతండ్రి! భక్తివర్ధనుడ!
నల్లవో! బసవన్న! నందీశమూర్తి! నల్లవో! బసవయ్య! ముల్లోక[5]వంద్య!
ఇట్టుండవలవదా పుట్టినఫలము - యెట్టును నున్నార మే మేమికొఱయుc?
దనయు నొప్పించి వస్త్రము సమర్పించి - వనిత నియోగించి జనకునిఁ ద్రుంచి
పడసిరాద్యులు దొల్లి బసవఁడిట్లిపుడు - పడయునే శివుకృప బట్టకబయల”
అని యెల్లవారును [6]నంకింపుచుండ - ననురాగచిత్తుఁడై యా బసవయ్య
కూడలి సంగయ్య గుడిమంటపమునఁ - గూడి భక్తావలి గొలు విచ్చియుండఁ
సారాంచితోక్తుల సంస్తుతింపుచును - బూరితంబుగ నాదపూజ సేయుచును
మూఁడుసంధ్యల గురుమూర్తిఁగొల్చుచును - [7]బోఁడిగాఁ బ్రొద్దులు వుచ్చుచునుండె
బసవ పురాణార్థపరిచయస్ఫీత! - బసవపురాణార్థపరిమళాఘ్రాత!
[8]బసవనామావళి పరమానురక్త! - బసవనామావళి పాటకాసక్త!
బసవపాదాంభోజ పరిమళభృంగ! - బసవపాదాంభోజభరితోత్తమాంగ!
బసవకారుణ్యసౌభాగ్యైకపాత్ర! - బసవకారుణ్యసంపత్కళా[9]మాత్ర!
బసవసన్నిహిత సద్భక్తాత్మసఖ్య! - బసవసన్నిహిత సద్భావనంగాఖ్య!
ఇది యసంఖ్యాతమాహేశ్వర దివ్య - పదపద్మసౌరభ భ్రమరాయమాణ
జంగమలింగప్రసాదోపభోగ - సంగత సుఖసుధాశరధినిమగ్న
సుకృతాత్మ పాలకురికి సోమనాథ - సుకవిప్రణీతమై శోభిల్లి తనరి
చరలింగ ఘన కరస్థలి విశ్వనాథ - వర కృపాంచితకవిత్వస్ఫూర్తిఁ బేర్చి
చను బసవపురాణ మనుకథయందు - ననుపమంబుగఁ బ్రథమాశ్వాసమయ్యె.

  1. తనరాజు
  2. చొచ్చియు ... నెచ్చటో?
  3. బాపురే
  4. బాపురే
  5. కీర్తి ఈ సమాసము నీతఁడు పెక్కుచోట్లఁ బ్రయోగించినాఁడు. "ముల్లోకనాథుని ముట్టంగఁగొలిచి” పండితా. ఇతరకవులుకూడ దీనిఁ బ్రయోగించిరి. “ముల్లోకవిభుండు సక్రి” ఓపిలిసిద్ధి శాసనము.
  6. వినుతింపుచుండ
  7. బోఁడిమిగాఁ బ్రొద్దువుచ్చును
  8. బసవాక్షరత్రయ
  9. మిత్ర