పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

25

సంగయదేవుఁడు బసవేశ్వరునకుఁ బ్రత్యక్షమగుట


దొల్లింటివేషంబుతో వచ్చి తేట - తెల్లగా సంగయదేవదేవుండు
గుడివెలిఁ బొడసూప గురులింగమూర్తిఁ - బొడఁగని బిట్టుల్కిపడి బసవండు
పెద్దయుఁ బ్రమదంబు [1]భీతియు భక్తి - దుద్దెక్కి తనలోనఁ [2]దొట్రుకొనంగ
నంతంత మఱియు సాష్టాంగుఁడై మ్రొక్కి - వింతవేడుక వెల్లివిరియ నగ్గురువు
చరణము లానందజలములఁ గడిగి - గురుపూజ తన్న కాఁగూడ నర్పించి
పడియున్న, నతిదయాభావామృతంబు - కడకంటఁ [3]గెడఁగూడఁగొడుకు లేనెత్తి
యందంద కౌఁగిట నప్పళింపంగ - ముందట మ్రొక్కుచు మోడ్పుఁగేలమర
నెలకొన్న తత్స్వర నేత్రాంగవిక్రి - యలు భూషణంబులై యాదట నున్న
బసవకుమారు సద్భక్తికి మెచ్చి - వెసఁబ్రసాదంబప్పుడొసఁగి యిట్లనియె;
“వచ్చినపోయినవారిచే నీదు - సచ్చరిత్రము విని సంతసిల్లుదుము
గతకాలవర్తనకంటె సద్భక్తి - మితిదప్పి నడవకు మీ బసవన్న!
శూలి [4]భక్తాలి దుశ్శీలముల్ గన్న - మేలకాఁ గైకొను మీ బసవన్న!
శత్రులైనను లింగహితులై యున్న - మిత్రులకాఁ జూడు మీ బసవన్న!
పట్టినవ్రతములు ప్రాణంబుమీఁద - మెట్టిన విడువకు మీ బసవన్న!
వేఱుభక్తులజాతి వెదకకుండుటయె - మీఱినపథము సుమీ బసవన్న!
చిత్తజాంతకుభక్తిఁ జెడనాడుఖలుల - [5]మృత్యువుగతిఁ ద్రుంపు మీ బసవన్న!
వేదశాస్త్రార్థసంపాదితభక్తి - మేదిని [6]వెలయింపు మీ బసవన్న!
తిట్టిన, భక్తులు కొట్టినఁ, గాల - మెట్టిన, శరణను మీ బసవన్న!
యేఁ దప్పువట్టుదు నిలఁ బర స్త్రీల - మీఁదఁ గన్నార్పకు మీ బసవన్న!
సాధ్యమౌ భక్తప్రసాదేతరం బ - మేధ్యంబకాఁ జూడు మీ బసవన్న!
నిక్కంపుభక్తికి [7]నిర్వంచకంబు - మిక్కిలి గుణము సుమీ బసవన్న!
ఏ ప్రొద్దు జంగమం బేనకాఁజూడు - మీ ప్రసాదముఁ [8]గొను మీ బసవన్న!
నాలుక కింపుగా శూలిభక్తులను - మేలకా నుతియింపు మీ బసవన్న!
యేమైన వలసిన [9]యెడరైనఁదలఁపు - మీ మమ్ము మఱవకు మీ బసవన్న!
మోసపుచ్చు శివుండు బాసలేమఱకు - మీ సత్య మెడపకు మీ బసవన్న!
అని మృదుమధురాంచితాలాపములను - దనయుఁబ్రబోధించి తాఁగౌఁగిలించి

  1. బ్రీతియు
  2. దొట్రి, దొప్పి
  3. నొడఁ
  4. శాసను”, లాంఛనుల
  5. మిత్తిగవైత్రుం
  6. మెఱయింపుమీ
  7. నిర్వంచకతయె
  8. గుడ్వుమీ
  9. యెడలను