పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము


శ్రీ లింగమథనవిలోలకేలీవి - శాలసౌఖ్యానంద! సంగయామాత్య!
అక్కడ నంతఁ గళ్యాణంబునందు - నెక్కుడు శివభక్తికెల్లయై పరగు
బండారి బలదేవదండనాయకుఁడు - దండి బసవనికిఁ దనయ నిచ్చుటయుఁ
బ్రమథు లెంతయుమెచ్చి రాఁబంపఁబోవు - క్రమమునఁ బ్రమథలోకమున కేఁగుడును
బలదేవమంత్రి యాప్తుల బంధుజనులఁ - బిలువంగఁబంచి యా బిజ్జలుం డనియె

బసవేశ్వరునకు బిజ్జలుఁడు దండనాయకపద మిచ్చుట


[1]ఇతనితోఁబుట్టువు సుతుఁ డెవ్వఁడేని - నితని నియోగంబు ప్రతిదాల్పఁగలఁడె?
అనవుడు "కలఁడు మహారాజ! యతని - తనయ ప్రాణేశుండు వినయోక్తిపరుఁడు
నీ రాజ్యమంతయు నిలువంగఁ [2]జాలు - దూరీకృతాఘుండు దోర్బలాధికుఁడు
విను మఖిలకళాప్రవీణుఁ డెట్లనిన - జనులెల్ల నెఱుఁగఁగ సంగమేశ్వరుని
చేఁ బ్రసన్నత వడసెను గాన నీకుఁ - దాఁ బ్రధానిగఁ దగు ధరణీశ” యనిన
నిజ్జగం బింతయు నేలినకంటె - బిజ్జలు డెంతయుఁ బ్రీతాత్ముఁ డగుచుఁ
దన వీటఁదగిన ప్రధానుల హితులఁ - దనయెక్కుభద్రేభమును నమాత్యులను
బసవనిఁ దోడ్తేరఁబంచుడు వారు - నెసకంబుతో సంగమేశ్వరం బేఁగి
యక్కడ బసవని నసమానుఁ గాంచి - చక్కఁ[3]జాఁగిలి మ్రొక్కి సరణి నిట్లనిరి
“నాకోపభోగాపునర్భవాదులను - నీ కొకలెక్కయే నిజమట్లకాక
శివభక్తిసారానుభవభవ్యసుఖికి - నవశంబ కాక రుచ్యములె యిన్నియును?
నైనను లోకహితార్థుండ వీవు - కాన మా ప్రార్థనఁ గైకొనవలయు
బిజ్జలక్షోణీశు ప్రియము సల్పినను - నిజ్జగతీతలం బేలఁడే(వే?) చెపుమ
మంత్రిపట్టమునకు, మండలంబునకుఁ, - దంత్రంబునకు, నిజాప్తమునకు, మూల
భండారమునకు భూపతిరాజ్యమునకు - నొండేమి నీవకా [4]కొడయ లున్నారె?
యతఁడు పట్టెఁడుకూటి కర్హుండ కాని - క్షితికెల్ల నీవచూ పతివి నిక్కంబు
విచ్చేయు” మని యిట్లు విన్నవించుడును - నచ్చోట భక్తహితార్థంబు దలఁచి

  1. హితుఁడు
  2. గలఁడు
  3. జాఁగిలఁబడి మ్రొక్కి యిట్లనిరి
  4. కున్న వారెవ్వరు