పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

v

లింగమును బ్రతిష్ఠించి పూజించుచున్నారు. శివలింగార్చనమును అద్వైతమతస్థాపకులు శ్రీ శంకరాచార్యులు వారి పీఠమునందుఁ బ్రతిష్ఠించిరి.

శివలింగము

అవ్యక్తము-నిర్గుణము, నిరాకారము, నిరహంకారము, నిరవద్యము. అవ్యక్తమును వ్యక్తమైన విశ్వమంతయును అనంతములైన నామరూపములను సేవించుచుఁ బ్రసవించుచున్నది. అవ్యక్తము లింగాకృతిని విశ్వవ్యాప్తమై యొప్పుచున్నది. ఆకాశలింగము, వాయులింగము, తేజోలింగము, ఆపోలింగము, పృథ్వీలింగము అవ్యక్తమునకు వ్యక్తస్వరూపములు. అవ్యక్తలింగస్వరూపములందుఁ బార్థివలింగము సగుణనిర్గుణస్వరూపములను గలిగి పూజాపాత్రమైనది. పార్దివలింగమును స్త్రీపుంసయోగచిహ్నముగను బండితులు కొందఱు నిర్ణయించినను, మహత్తునకు బీజచిహ్నముగ నున్న లింగమున కీ లక్షణ మప్రధానము. లింగము షడక్షరీమంత్రరూపమని శైవాగమములు విశదముచేయుచున్నవి. ఈ లింగమాకాశాది పంచభూతము లందును గోచరం బగుచున్నది.

శివలింగమును వర్ణవివక్షత లేక సకలవర్ణములవారును బూజించు చున్నారు. బ్రాహ్మణులు దేవతార్చనలందును, సకలవర్ణములవారును, దేవళము లందును, శివలింగమును బూజించుచున్నారు. లింగధారులు లింగమును స్వీయాంగములందు ధరించుచు శైవులును, వీరశైవులును నగుచున్నారు. లింగధారణము గూఢార్థమును, బాహ్యార్థమును గలిగి, వీరశైవమున కపూర్వమైన వ్యక్తిత్వమును గలుగఁజేయుచున్నది.

వీరశైవము

వీరశైవము వైదికమతమును, జైనబౌద్ధమతములను బ్రతిఘటించుట కేర్పడిన శైవమతము. శైవమతము భరతఖండమునందు - ముఖ్యముగ దక్షిణప్రాంతములందు - వ్యాపకమునుబొందిన ప్రాచీనమతమని శైవాచార్యుల చరిత్రలు తెలుపుచున్నవి. ద్రవిడాంధ్రకర్ణాటక దేశములందు శైవము