పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iv

పురాణములందును జిజ్ఞాసువులకు గోచరంబగుచున్నవి. మానవుని నిత్యజీవితమునందు దుఃఖనివృత్తికిని, సుఖప్రాప్తికిని దైవసందర్శనము పరమసాధనముగనున్నది. జైనబౌద్ధమతములు సంసారము దుఃఖసాగరమనియును, సన్న్యాసము సుఖసాధనమనియును నుపదేశించినవి. అద్వైతము సంసారము మాయాకల్పితమని యుపదేశించినది. పండితులు, బ్రాహ్మణులు కర్మలతోను, సిద్ధాంతములతోను, సన్న్యాసాశ్రమముతోను గాలయాపనము చేయుచున్నను బ్రజ లజ్ఞానాంధకారమగ్నులై దుఃఖవేదన ననుభవించుచుండిరి. వైరాగ్యము, నిర్లిప్తత్వము, నిర్లక్ష్యము, నిఃస్పృహ, నిస్సహాయత్వము పరిపాటియై, భారతీయచైతన్యము నిర్వీర్యమైనది. ఈ విషమావస్థయందు బసవేశ్వరోపస్థితమైన వీరశైవము మతధర్మములందును, లక్ష్యమునందును, సాంఘికార్థికపరిస్థితులందును మహాపరివర్తనమును గలుగఁ జేసినది.

శైవము

శైవమతపరిణామము వైదికమతపరిణామమునకుఁ బ్రత్యక్షప్రమాణముగ నున్నది. వైదికమంత్రోపస్థితుఁడైన రుద్రుఁడు వేదాంతమునందు శివరూపపరిణామమును బొందుచు, “శివో౽హం ” అను తత్త్వమును సువ్యక్తము చేయుచున్నాఁడు. శివుఁడు యజ్ఞపురుషుఁడు. శివుఁడు సగుణనిర్గుణపరబ్రహ్మ. శివుఁడు హిమాచలమునందు గౌరీశంకరుఁడు; రామేశ్వరమునందు రామలింగేశ్వరుఁడు; కాశ్మీరమునందు మహాదేవుఁడు; మధురయందు సుందరేశ్వరుఁడు; కాశీయందు విశ్వేశ్వరుఁడు; సౌరాష్ట్రమునందు సోమనాథుఁడు; శ్రీశైలమునందు మల్లికార్జునుఁడు. శివాలయములు దేశావృతములై శైవమతవ్యాప్తిని దెలియఁజేయుచున్నవి. పాశుపతులు, కాలాముఖులు శివపూజాపరాయణులు. శైవులు లింగరూపమునను శివునిఁ బూజించుచు శివోత్కర్షను జేయుచున్నారు. అధర్వశిఖయందలి “ఈశ్వరః శివ ఏవ చ... శివ ఏకో ధ్యేయః శివఙ్కరః", స్కందోపనిషత్తునందలి “జీవ శ్శివ శ్శివో జీవః స జీవః కేవల శ్శివః” మొదలగు వాక్యములు శివోత్కర్షను దెలుపుచున్నవి. శైవులు శివాలయములయందును, పీఠములయందును, స్వాంగముల యందును