పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vi

వ్యాపించినవిధమును భక్తుల చరిత్రములు విశదముచేయుచున్నవి. శంకరాచార్యులు జైనబౌద్ధమతములను నిర్వీర్యములఁజేసినను ప్రజాసామాన్యమునం దామతములు వ్యాప్తిని గాంచియున్నవి. అద్వైతసిద్ధాంతములు ప్రజలకు దుర్బోధ్యములు. జైనబౌద్ధమతములు నాస్తికమతములు. అద్వైతసిద్ధాంతములు, జైనబౌద్ధమతములు వైదికకర్మల ప్రతిభను తగ్గించినవి. ప్రజాహృదయమునందుఁ గలిగిన నూతనోత్సాహమును వీరశైవము పల్లవింపఁ జేసిన విధమును బసవేశ్వరచరిత్రము తెల్లము చేయుచున్నది. బసవేశ్వరుఁడు బ్రాహ్మణకులమునందు జన్మించినను ఉపనయనమును నిరాకరించి వీరశైవదీక్షను బూనిన పరమశివభక్తుఁడు. వీరశైవము కర్మమార్గమును నిరసించుచున్నవిధమును వీరశైవసిద్దాంతములు వెల్లడిచేయుచున్నవి. బసవేశ్వరుఁడు వడుగును నిరాకరించుచుఁ దండ్రికిఁ జెప్పిన సమాధానము కర్మనిరసనమును జేయుచున్నవి.

కూలి భక్తుల కెత్తుకెలది త్రాటి - మాలలకెత్తుట మఱి తప్పుగాదె?
కర్మపాశంబు లొక్కటఁదెగ నీల్గి - కర్మంబు త్రాళ్లు దాఁగట్టుకోఁదగునె?
రుద్రాక్షభసితాదిముద్రలు దాల్చి - క్షుద్రముద్రలు దాల్పఁగూడునే చెపుమ
యీ రీతిఁద్రాటికిఁదూరమై యున్న - వీరమాహేశ్వరాచార దీక్షితుని
నిర్మితోభయకర్మనిర్మూలు నన్నుఁ - గర్మాబ్ది ముంచుట ధర్మమే నీకుఁ?
గ్రచ్చఱఁగన్నులఁగానవు గాక - వచ్చునే బసవని వడుగుసేయంగ
బ్రహ్మశిరోహరుఁబ్రమథైకవంశ్యు - బ్రహ్మవంశ్యుండని భావించె దెట్లు?
జాతిగోత్రాతీతు సద్గురుజాతు - జాతిగోత్రక్రియాశ్రయుఁ జేసెదెట్టు?
అకులస్థుఁడై యున్న యభవుని భక్తు - నికనేకులంబని నిర్ణయించెదవు?

              * * * * * * * * * * * *

“ధరనన్య దేవతాస్మరణమాత్రమున - నిరువదెన్మిదికోట్లు నరకంబులొందు”
నన శ్రుతులందును వినరె బాపనికి - దినకరపావకదిక్పాలకులను
హరివిరించ్యాదులనఖిలదేవతల - ధర మూఁడుసంధ్యలఁదాఁగొల్వవలయుఁ
గొలువక తక్కినఁబొలిసె బ్రాహ్మ్యంబు - కొలిచెనేనియు భక్తి వొలిసెఁగావునను
బ్రాహ్మణుఁడేనియు భక్తుఁడెట్లగును? - బ్రాహ్మణుఁడెట్లగు భక్తుఁడేనియును?