పుట:ప్రబోధచంద్రోదయము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యభిప్రాయములను నుదాహరించిన పాఠకలోకమునకు విశదమగును. వీరి కవిత "ధారాశుద్ధి సహజమై సమగతి కలదియై విరాజిల్లును.

“సుకుమారమై మృదులమై ప్రతి పద్యరససురితమై హృదయంగమముగానుండును."

అచ్యుతరావుగారు వరాహపురాణమును ప్రభోధచంద్రోదయమును తలస్పర్శగా నవలోకించి యీక్రింది యభిప్రాయమును ప్రకటించిరి.

"వీరు రచించిన రెండు గ్రంథములలోను ప్రబోధచంద్రోదయమే ఎక్కువ గణనీయమైనదని నే నభిప్రాయ పడుచున్నాను. దీని శయ్యారీతులు లేబ్రాయపురచనను బొడసూపుచున్నవి. అయినను రసపుష్టిచే నిగనిగలాడు దాక్షాఫలమంజరులవలె కోమలమై మృదులమై సర్వవిధముల మనోహరమై యున్నది. అందలి పద్యరచన యెంతరమణీయముగా నున్నదో గద్యరచనయు నంతసరళముగాను మనోజ్ఞముగాను నున్నది. వీరిగద్యము పింగళిసూరనార్యుని గద్యమువలె దీర్ఘసంస్కృతసమాసములు లేక చిన్నచిన్నశబ్దములతో గూర్చబడి అనుప్రాసమాత్రశబ్దాలంకారశోభితమై ముత్యంపుసరులవలె, విరాజిల్లుచున్నది."[1]

అచ్యుతరావుగా రన్నట్లు గద్యరచన ముత్యపుసరులవలె నుండుటయేగాక పద్యరచనయు ముత్యంపుసరులవలె నున్నది. ఈ సందర్భమున నీకవులు కావ్యారంభమున నిట్లు చెప్పుకొన్నారు.

క.

నేరుపరి సోహణించిన
హారమువెల యెక్కులీల నతిశయముగ నా
పేరఁ దెనిఁగింపవలయును
సారపుఫణితులఁ బ్రబోధచంద్రోదయమున్

(1-25)
  1. విజయనగరసామ్రాజ్యాంధ్రవాఙ్మయచరిత్ర పథమభాగము పుట 268-270