పుట:ప్రబోధచంద్రోదయము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంకములకు ఆఱాశ్వాసములు చేసిన యెడల, ఆశ్వాసములు చాల చిన్నవి యగును. అందువలన కవు లిట్లు చేసినారని మనము భావించవలెను.

మూలమున చతుర్ధాంకము "మైత్రి" అను పాత్రతో ప్రారంభము. కాని తెలుగున - ఆ పాత్ర తృతీయాశ్వాసముననే ప్రవేశపెట్టబడినది. వివేకమహారాజు స్వగతము. ఆవెనుక వస్తువిచారుడు వచ్చుట గలదు. పంచమాంకమున గల కథయంతయు. చతుర్థాశ్వాసముననే చెప్పబడినది. ఇందుమూలమున సంస్కృతమూలమునగల ఆఱు అంకములు తెలుగున ఆయిదాశ్వాసము లైనవి.

గ్రంధకర్తలు శైవులు. శివుడు పంచముఖుడు గాబట్టి మూలమున 6 అంకములున్నను, తెలుగున 5 ఆశ్వాసములుగా వ్రాసిరని మనము సమర్థించుకొనవరెను.

ఈసంస్కృతనాటకము యథామూలముగానె అనువదింపబడినది. కాని సంస్కృతమునగల శ్లోకములు, తెలుగున సీసపద్యములు వ్రాయునపుడు మూల భావములు మూడు పాదములలో నిమిడిన నాలవపాదమున ఎత్తుగీతియందు స్వంతకల్పన కథాసందర్భమున చేసిరి.

(i) మూలమునలేని భావములు చేర్చుట -
(i)శ్లో.

అహల్యాయై జారః సురపతిరభూరాత్మా తనయాం
ప్రజానాథోయాసీ దభజతగు రోరిందురబలామ్
ఇతిప్రాయః కోవాన పథమనదే కార్యతమయా
శ్రమోమద్బాణానాం కఇవ భువనోన్మాదవిధిషు.

(1-14)


సీ.

 తనకన్నకూతును దాన పెండ్లాడఁడే
                          వారిజగర్భుండు వావి దప్పి
బలభేది గౌతముభార్య నహల్యఁ గా
                          మించి చేయడె నల్లమేఁకతప్పు
కడలేనిరట్టడి కొడిగట్టుకొనియైనఁ
                          గమలారి గురుతల్పగతుఁడు కాఁడె