పుట:ప్రబోధచంద్రోదయము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాధారణముగానే మార్పు లేకుండగనే స్వీకరించిరి. దృశ్యకావ్యము శ్రవ్యకావ్యముగా చేయుటచే ప్రారంభముననే మార్పు చేయవలసి వచ్చినది.

మూలమున నాద్యంతమున నటీసూత్రధారుల ప్రస్తావన యైనవెనుక తెర యెత్తిన వెంటనే కాముడు రతియు ప్రవేశించి నాటకకథావిషయము సంభాషణమూలమున దెలుపుదురు.

తెలుగున నిది ప్రబంధము గావున ప్రబంధపద్ధతిని పురవర్ణనతో ప్రారంభమైనది.

చిదానందనగరి యను పురముగలదు. ఆపురమునకు ఈశ్వరుడు రాజు. మాయ యాతనిభార్య. ఆతనికి మనసనెడు కుమారుడు గలడు. ఆతని కిరువురుభార్యలు. వారివలన పుత్రులు గలిగిరి. ఆపుత్రులు దాయాదులుగాన రాజ్యముకొఱకు తగవు లారంభమైనవి. పెద్దభార్య కొడుకు రాజ్య మాక్రమించు రెండవభార్య కొడుకులను తరుమగొట్టుట కొకయాలోచనసభ కావించెను. అని కథాక్రమము తెలిపిన తరువాత ఆఆలోచనసభలో రతికాములసంభాషణ ప్రవేశపెట్టబడినది.

నాటకములో పాత్రలే కథాక్రమమును వివరింతురు. ఇది కావ్యము గాన కవియే కథాక్రమము దెలుపును. ఇదియే రెండింటికిగల భేదము. దృశ్యకావ్యము శ్రవ్యకావ్యముగా చేయుటచేత అనువాదమున ప్రారంభముననేగాక కథాప్రణాళికలో కొన్ని మార్పులు ప్రవేశపెట్ట వలసి వచ్చినది.

1) మూలమున కాశీనగరమున మహామోహమహారాజు ప్రవేశించినప్పుడు కొంతపరివార మున్నదని మాత్రము గలదు. గాని కాముడు క్రోధుడు మొదలగువారు మోహుని దగ్గఱ నున్నట్లులేదు ప్రతిహారిని పంపి వారిని పిలువ నంపెను.

ప్రబంధమున నట్లుగాక మహామోహునితోడనే వారందఱు ప్రవేశించినట్లు గలదు.

2) మూలమున నుపనిషద్దేవి శాంతిసహితయై ప్రథమమున జీవేశ్వరునికడకు బోయినట్లుగ నున్నది. తెలుగున జీవేశ్వర మహారాజే మొదట ప్రవేశించినట్లుగా నున్నది.