పుట:ప్రబోధచంద్రోదయము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొట్టెను. అంతట కర్మమీమాంసాతరుణి యొద్దకు నే బోవ నామెయు యజ్ఞవిద్యాదేవివలెనే న న్నోర్వలేక పొమ్మని దారి జూపెను. తరువాత తర్కవిద్యలవద్దన జేరగ వారు నానావిధకర్కశభాషణములను నన్ను రెచ్చగొట్టి చెలరేగి నన్ను బంధించుట కనుసంధించుచుండ నేభయభ్రాంతనై పాఱుచున్న నన్ను జూచి విష్ణుభటులు వెఱవకు వెఱవకుమని నా కభయ మిచ్చి యాకఠినహృదయలగు నాతర్కవిద్యలను మోది చెదరగొట్టిరి. అంత నాపుత్రికయగు శ్రీగీత మచ్చికమున వచ్చి కౌగలించి న న్నూరడించెను. ఇ ట్లనన్యసామాన్యవిషయావస్థలను బొంది తిరిగి ఏలినవారిప్రాపున జేరగలితిని" అని పలికి జీవేశ్వరునితో "నీవు పరమాత్మవు నీకును పరమేశ్వరునకు భేదము లేదు" అని చెప్పిన జీవేశ్వరు డామాటల యాథార్థ్యమును గ్రహింపనేరక వివేకుని వంక చూచెను. ఆమహానుభావుడు యుపనిషద్దేవి మాటలను వివరముగా వినిపింప జీవేశ్వరుడు గ్రహించి సంతసించుచున్నసమయమున నిధిధ్యాసమును శాతోదరి వారిని సమీపించి యుపనిషద్దేవికి సంజ్ఞ చేసి యిట్లు చెప్పె.

"విష్ణుభక్తిమహాదేవివలన ఈ సందేశమును మీకు గొనివచ్చితిని. వివేకమహారాజు సన్నిధానమున నీ వుండినమాత్రమున సంకల్పజననివై విద్యాప్రబోధచంద్రుల నీగర్భమున దాల్చితివి. నీవు నీ తనూజయగు విద్యాకన్యను మనసునందు ప్రవేశపెట్టి ప్రబోధచంద్రుని పురుషునియందు నిల్పి నీవు వివేకుని దోడ్కొని యామెకడకు జేరుమని యామె యాజ్ఞాపించినది" అని యిట్లు చెప్పి నిధిద్యాసము జీవేశ్వరునియం దంతర్థాన మయ్యెను.

తరువాత విద్యుల్లతాప్రభాసియగు విద్యాకన్యయు నిర్మలసహజప్రకాశమానుడగు ప్రబోధచంద్రుడును నావిర్భవించిరి. జీవేశ్వరు డపారమగు సంతోషమును బొంది వారిని గౌరవించి యతిశయించుచున్న సమయంబున విష్ణుభక్తిమహాదేవి చనుదెంచెను. జీవేశ్వరు డామెకు వినమితోత్తమాంగు డై ప్రణమిల్లి దీవనలు పొంది యామె యానతిచొప్పున వివేకుని మంత్రిగా జేసికొని శ్రద్ధమతి, శాంతి మున్నగు నారీమణుల వనితల కాస్పదుండై నిరుపమానవైభవమున సదానందసామ్రాజ్యము నేలుచుండెను.