పుట:ప్రబోధచంద్రోదయము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముల నిర్జించుటకు సైన్యముల నన్నింటిని చేరగూర్చుకొని యాయత్తపడియుండవలెను. విష్ణుభక్తిమహాదేవి కావలసిన సాయ మొనరించుటకు సిద్ధముగా నున్నది." ఆమాటలు విని శ్రద్ధాదేవి యవిలంబితముగా వివేకమహారాజు కడ కేగి విష్ణుభక్తిదేవి నుడివిన పలుకులు యథారీతిగా విన్నవించెను. అంత వివేకనృపాలు డెరిగి బలము లన్నిటిలో ప్రోడయగు కాముని జయింప సమర్థు డెవ్వడని యోచించి వస్తువిచారునకు వర్తమానము పంపెను. అంత నాతడు వచ్చి తాను కాముని సునాయాసముగా జయింపగలనని ప్రతిజ్ఞ చేసెను. క్రోధుని భంజించుటకు క్షమను, లోభుని నిరోధించుటకు సంతుష్టిని నియోగించి తదితరబలానీకంబులనెల్ల గలయంజూచి యందరను ద్వరితముగా కాశికానగరమునకు సమరోత్సాహమున ప్రయాణు డగుడని యాజ్ఞాపించి జయభేరిని మ్రోగింప శాసించెను.

వివేకమహారాజు మహానీకసమేతుడై కాశీనగరంబు జొచ్చి ఆదికేశవుని దర్శించి, స్థుతించి ధర్మయుద్ధమునకు సిద్ధముగా నుండెను.

మహామోహాదివీరులును సంగ్రామమునకు తమతమ సేనలను కూర్చుకొని పేర్చి కాశీనగరముననే విడిసియుండిరి. ఇ ట్లుభయసైన్యంబులును జయధ్వానములతో దిక్కులు పిక్కటిల్ల నార్చుచు సమరకోలాహలమున సంభ్రమింపుచుండిరి. రుధిరధారాసిక్తమగు యుద్ధభూమిని చూడనొల్లక విష్ణుభక్తిమహాదేవి "శ్రద్ధా! యుద్ధానంతరమున జయాపజయంబుల పర్యవసానము సత్యముగా నాకు జెప్పుమని యాజ్ఞాపించి శాంతితో గూడ సాలగ్రామశిఖరమున నున్న చక్రతీర్థమునకు బోయెను.

యుద్ధము ప్రారంభమైనది. వివేకాదియోధులయెదురు మహామోహాదివీరులు నిలువలేక పరాజితులై పికాపికలై చెదరి పారిపోయిరి.

మహామోహు డెక్కడ యణగెనో ఎరుక పడలేదు. వివేకమహారాజు జయజయధ్వానములతో కాశీపురము ప్రవేశించెను. ఈ వృత్తాంతమంతయు శ్రద్ధాదేవి సత్వరముగా నేగి విష్ణుభక్తిమహాదేవికి నివేదించెను.

మహామోహాదులపరిభవము విని తండ్రియగు మనస్సు పలువిధముల శోకించి పలవరించుచున్న సమయమున విష్ణుభక్తిమహాదేవి వ్యాససరస్వతిని బంపి