పుట:ప్రబోధచంద్రోదయము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శత్రువర్గములోనిదైన చిన్ననిసువునైనను నుపేక్షింపకూడదని తన సేవకవర్గమున కాజ్ఞాపించెను.

ఆలోన నొకప్రతీహారి వచ్చి పురుషోత్తమదేవాలయమున నున్న మదమాదులు దేవరవారి కొకవిజ్ఞానపత్రిక పంపిరని చెప్ప మహామోహమహారా జాపత్రిక గైకొని శ్రద్ధయు, ఆమె కొమార్తెయగు శాంతియు గలసి వివేకమహారాజునకు ఉపనిషద్భామినికి పొత్తు కలుగునట్లు దౌత్యము నడుపుచున్నా రనియు ధర్మము వైరాగ్యము మున్నగు పెద్ద లీకార్యసంఘటనము నిమిత్తము సహకారులుగా నున్నారనియు వ్రాసినసంగతులను చదువుకొనెను. పిమ్మట కామక్రోధలోభులను పిలిచి ధర్మములు కట్టిపెట్టుమని కామునికిని శాంతిని బంధింపుమని క్రోధలోభులకు నానతు లిచ్చి శ్రద్ధను వశము చేసికొనుటకు నాస్తికతతప్ప వేఱొకరు సమర్ధులు గారని యూహించి మిథ్యాదృష్టి పేరబరగు నాస్తికతను తోడితెమ్మని విభ్రమావతిని యనుదాసిని పంపెను. ఆమె శీఘ్రమే పోయి మిథ్యాదృష్టిని తోడ్కొని వచ్చెను. అంత మహామోహుడు తనకత్యంత ప్రియతమయైన మిథ్యాదృష్టిని జూచి పరమానందభరితుడై ఆమె యాలింగనసుఖమున కొంతదనుకు శృంగారలీలల దేరిన యామెతో నామె రప్పించిన కార్యము తెలిపి శ్రద్ధను మాయోపాయములచే బద్దురాలిం జేయ పంపెను.

అట్లు మహామోహుని యాజ్ఞానువర్తియై మిథ్యాదృష్టి శ్రద్ధాలలనయొద్దకు బోయి తన కపటోపాయములచేత నామెను వేదమార్గమునుండి తప్పించి, పాషండమతవశంవదను చేసి మరుగుపెట్టెను. శాంతికన్య తనతల్లిని కానలేక విభ్రాంతి నొంది తిరుగులాడుచు, విలపించుచు, పాషండసదనమునైన నున్నదేమో యని వెదకికొన నుద్దేశించి, తననెచ్చెలియగు కరుణతోగూడ పోవుచుండెను. ఆ సమయమున నొకవికృతాకారుడగు పురుషు డాదారినే వచ్చుచుండుట చూచి,రాక్షసుడో, పిశాచమో అని సంశయించి, భయభ్రాంతులై కొంతసేపటికి తెప్పిరిల్లి యానూతనపురుషు డొకదిగంబరసన్యాసియని తెలిసికొనిరి. అప్పుడు శాంతి తనతల్లి యామనుష్యునియొద్ద నుండునేమోయని కనుగొనుట కచటనే నిలువ బడెను. ఇంతలో నా దిగంబరుడు "అర్హంత” “అర్హంత” అని తనశ్రావకవర్గమును పిలిచి స్వమతోపదేశమును చేయుచు శ్రద్ధను రావించి వారికి