పుట:ప్రబోధచంద్రోదయము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్వము నామెకు దెలిపెను. విద్యాప్రబోధచంద్రు డె ట్లుద్భవింతురని యామె ప్రశ్నింప తనతో కలహించి, చని, తన వియోగమవలన కృశించుచున్న యుపనిషద్భామినికి తనతో పునస్సమాగమము గలుగునేని విద్యాప్రబోధచంద్రు లుదయింతురని చెప్పిన నా సాధ్వీలలామ యందుల కీయకొనెను.

మహామోహునిచే నాజ్ఞాపితుడై దంభుడు వారాణాసీపురమున కేగి యచ్చట నివాస మేర్పఱచుకొని రాజకార్యనిర్వహణమున నప్రమత్తుడై యుండెను. ఒకానొకదినమున వానియింటి కొకపురుషుడు యాదృచ్ఛికముగా వచ్చి యాతిథ్యమును గ్రహింపనొల్లక దురహంకృతి కనబఱచగా వారి కిరువురకు జరిగిన సంభాషణక్రమమున నా నూతనపురుషు డహంకారుడని తెలియవచ్చినది. అప్పుడు దంభు డహంకారునకు మ్రొక్కి తాను లోభుని కుమారుడనియు, నందుచే అహంకారునకు మనుమడనియు బంధుత్వము తెలుపుకొనెను. పిమ్మట నిరువురును తమ తమ యాచరణీయవిషయములను చర్చించి మహామోహుని యాజ్ఞానుసారముగా నుభయులును కాశీక్షేత్రమునకు వచ్చిన ట్లెఱిగికొనిరి.

ఇట్లుండ మహామోహమహారా జాసమయమున కాశీపురమున సపరివారముగా ప్రవేశించెను. దంభాదిబంధువర్గమును క్షపణకబౌద్ధకాపాలికాదిపరివారనికరమును నా మహారాజును చుట్టుకొని సంతోషసంభ్రమకోలాహలంబున చెలరేగిరి. మహామోహరాజు తనబంధుమిత్రాదులకు తననాస్తికమతప్రకారము సర్వమును బోధించి శరీరము వేఱనియు, ఆత్మ వేఱనియు చెప్పు వేదవాక్యము లబద్ధములనియు పంచభూతపరిపాకప్రాప్తచైతన్యమగు నీదేహమే ఆత్మ యనెడు సిద్ధాంతము సత్యమనియు వాక్రుచ్చి, వేదచోదితకర్మాచరణులను నిర్మూలము గావింపవలసినదని గాంభీర్యమున జెప్పుచుండ, తనమతాచార్యవర్యుడైన చార్వాకుడు శిష్యసమేతుడై విచ్చేసి మహారాజును దీవించి సమస్తము దేవరపంపున సాధింపబడెనని నివేదింప మహామోహాదిసమస్తరాజన్యలోకము కడుంగడు సంతసించె. విష్ణుభక్తియను కల్లరిపిల్ల మాత్ర మింకను లొంగకుండ సిలుగులు పెట్టుచున్నదని కొంతనంకోచముగా చెప్పెను. అంత చార్వాకుని మాటలు విని మహామోహుడు నిట్టూర్పు నిగిడించి యామూర్ఖురాలు పట్టిపట్టు విడువదుగాని కామక్రోధాదులముందఱ నామె త్రుళ్లగింతలు సాగవని యూరడిల్లె. అయినను