పుట:ప్రబోధచంద్రోదయము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యుభయపక్షములవారికి భువనైకాధిపత్యముకొఱకు నిరంతరము తగవు గలుగుచుండెను. జ్యేష్ఠవర్గమగు మహామోహాదులయందు జనకునకు పక్షపాత ముండుటచేత వివేకాదులు సమరమున నిలవలేక చెల్లాచెదరై పారిపోవలసివచ్చెను.

మహామోహుడు రాజ్యము స్వీకరించి సాపత్నీయులగు వివేకాదులను నిర్మూలము చేయ నుద్దేశించి వా రెక్కడెక్కడ దాగియుందురో వెతకించుటకు చారులను పంపెను. వారు విశ్వమునగల పురములన్నిటిని వెదకి యచ్చటచ్చట వివేకాదులు పొడసూపుట ఎరిగినవారై తమయేలికసంగతి విన్నవించిరి. మోహు డుగ్రుడై పేరోలగమున తనతమ్ముల విలోకించి వివేకాదుల నెట్లు భంజింపవలయునో తగు నుపాయము తెల్పుడని సోదరామాత్యవర్గముల కాజ్ఞాపించెను. అంత కాముడు తన అద్భుతప్రాభవమును ప్రకటించుచు వాసంతికా, నవమల్లికా వికసితవల్లీమ తల్లులవలె నుల్లసిల్లెడు పల్లవాధరలు తనబలానీకములో నుండగా వివేకాదు లె ట్లాహవమున నిలువనోపుదురని యుత్కటగర్వమున ప్రగల్భించెను. రతి కొంతప్రతివచనము కొనిసాగించియు లాభము లేదని యూరకుండెను.

మహామోహుడు సభాంతరమున రహస్యాలోచనము చేయుచుండినపుడు దుర్గుణుడను వేగులవాడు వచ్చి వివేకమహారాజు ఉపనిషద్దేవిని పునఃపరిగ్రహించుటకును ఆ యిరువురిసంయోగమువలన విద్య ప్రబోధచంద్రు లుదయించుటకు ప్రయత్నములు జరుగుచున్న వనియు నవి నిర్నిఘ్నముగా నెఱవేరుటకు శమదమాదులు సకలపుణ్యతీర్థములకు బోయి దేవతాప్రార్థనలు చేయ సమకట్టియున్నారనియు, పిడుగువంటి వార్త వినిపించెను. మహామోహుడును భయవిహ్వలుడై తన ముఖ్యసచివుడగు దంభుని జూచి "మిత్రమా పుణ్యతీర్థములో ప్రశస్తమైన కాశీనగరంబునకు బోయి వివేకుని ప్రయత్నములకు భంగము కావింపవలయునని చెప్పిపంపెను.

మహామోహు డొనరించిన యాలోచనలును దంభాదులకు నియోగించిన యాజ్ఞావిశేషములను రహస్యముగా గనిపెట్టి సదాచారు డనెడు చారుడు తత్వృత్తాంతము పూసగుచ్చినట్లు వివేకమహారాజునకు నివేదించెను. ఆ మహీపతి చింతాకులుడై తన యగ్రమహిషియగు మతిని రావించి యా యుదంతము