పుట:ప్రబోధచంద్రోదయము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురంజనోపాఖ్యానము కథాసంగ్రహము

"స్వకర్మానుసారముగా ననేకశరీరములు ధరించువాడు గావున పురంజనుడనగా జీవుడు. పురము శరీరము ఇతని సఖుడగు నవిజాతుడనువా డీశ్వరుడు. స్త్రీతామసబుద్ధి దానివెంటవచ్చు పదునొకండ భృత్యులు ఏకాదశేంద్రియములు. (కర్మేంద్రియము లైదు జ్ఞానేంద్రియము లైదు మనస్సు ఒకటి) ఐదుతలలు గల సర్పము పంచప్రాణవృత్తి. పురమునకు నవద్వారములనగా శరీరముయొక్క నవరంధ్రములు. మృగయావిహారమే విషయోపభోగము. వార్థకము కాలకన్య. దాని సైనికులు - ఆదివ్యాధులు.

ఈ శరీరమందున్న జీవుడు తామసబుద్ధికి లోనై, సంసారమందు దగిలి దారపుత్రాదిసంగమము స్థిర మనిపించి కుటుంబపోషణకై నానావిధతాపముల నొందుచు సుఖప్రదములను భ్రాంతిచే దుర్విషయములను సేవించుచు నరిషడ్వర్గములకు జిక్కి లేశమైనను సుంసకృతము చేయనొల్లక పాపరతియై స్త్రీలచే క్రీడామృగమువలె నాడింపబడుచుండును.

అత డప్రమత్తుడై కాలము బుచ్చుచుండ తుద కనేకవ్యాధులు శరీరమంతట నిండి పీడింపగా నాబాధ సహింపజాలక మృతినొందును. నిర్యాణకాలమందు దా నెద్ది స్మరించుచు కళేబరము విడుచునో యదియై పుట్టును. ఆజన్మమం దీశ్వరకటాక్షమునకు బాత్రుడై సదాచారసమాశ్రయణమువలన సంసారము హేయమనియు భగవచ్చరణారవింద ముపాస్య మనియు దెలిసికొని సంస్కృతిబంధవిముక్తు డగును."

ఇది యీ గ్రంథమునకు మూలమైన పురంజనోపాఖ్యానము తాత్పర్యసంగ్రహము;[1]

  1. ప్రబోధచంద్రోదయవిమర్శనము పూర్వోక్తము. ఆంధ్రభాగవతమున నీపురంజనోపాఖ్యానము చతురస్కందమున 742 పద్యము మొదలుకొని 851 వరకును 109 గద్యపద్యములలో గలదు.