పుట:ప్రబోధచంద్రోదయము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధ్యాత్మికేతివృత్తము

నాటకము

ఇంతటి మహాగంభీరమైన ఆధ్యాత్మికేతివృత్తము కేవలము నైహికమగు లౌకికానందము గలిగించునాటకముగా కృతికర్త రచించుటలోగల యాంతర్యార్థమును గ్రహింపవలయును

కృతిక ర్తయగు కృష్ణమిశ్రు డీయద్వైతవేదాంతప్రతిపాదకగ్రంథమును ఒకకావ్యరీతిని రచింపక నాటకముగానే వ్రాయుటకు గలకారణమును కీర్తిశేషులు మేడేపల్లి వేంకటరమణాచార్యులుగా రిట్లు సమర్థించినారు.[1]

నాటకమందు ప్రతిపాదింపబడు నర్థమంతయు నభినయప్రధానమైనది గదా! ప్రబోధచంద్రోదయముందు ప్రతిపాదింపబడు వేదాంతార్థమునకు గల్గెడు ప్రాకట్యాతిశయము పరోక్షోపదేశ ర్యవసాయులగు భాష్యాది గ్రంథములయందు గలుగనేరదు. ఇంతియేకాక బ్రహ్మాజ్ఞానసాధనములగు శ్రవణమనననిధిద్యాసనవస్తువిచారాదులు వేఱువేఱుగా నొక్కొక్కటియే చిరకాలాభ్యాసవశ్యములుగా గానవచ్చుచున్నవి. అట్టిసాధనములకు బ్రత్యక్షప్రయోగప్రదర్శనాత్మకమగు నభినయమువలనగాని విశదతమజ్ఞానము సంభవింపనేరదు. ఎట్లన యాజ్ఞికుడు కల్పసూత్రాదులను బాగుగఁ జదివినవాడైనను యాగశాలలయం దాచరింపఁబడుచుండెడు శ్రోతకర్మలప్రయోగము దాఁ బ్రత్యక్షముగా నీక్షించిన గాని ప్రయోగకౌశలము నొందజాలడు. మఱియు యోగి గురుముఖముగా యోగశాస్త్రము జదివినను, గురువుచే బ్రత్యక్షముగా గనపఱచబడు స్వస్తికాద్యాసనబంధముల గన్నులార జూచినగాని యోగప్రావీణ్యము బడయజాలడు. అట్లనే ముముక్షువుగూడ వేదాంతశాస్త్రమును కూలంకషముగా జదివినవాడైనను బ్రహ్మనిష్ఠులచే నభినీయమానంబగు వస్తువిచారాదికము బలుమారు ప్రత్యక్షీకరించినగాని బ్రహ్మజ్ఞానసంపాదనసాధనపటిష్ఠుడు గానేరడు.

  1. ప్రబోధచంద్రోదయవిమర్శనము ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక తృతీయసంపుటము. 6వ సంచిక 1914. పుటలు 400-424.