పుట:ప్రబోధచంద్రోదయము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పై వద్యమునుబట్టి ఇది "సర్వవేదాంతసారము" అని తెలియుచున్నది. విద్ అనగా జ్ఞానము. వేదము అనగా జ్ఞానము ప్రసాదించునది. అది కర్మజ్ఞానమును తెలుపును. వేదాంతమనగా వేదములకు చివర నుండునది. వేదాంతము కేవలము జ్ఞానమును దానిని యనంతత్వమును దెలిపి బ్రహ్మను నిరూపించును. బ్రహ్మ ఆనందస్వరూపము. ఆ బ్రహ్మానందము సిద్ధించుకొఱకు మార్గము జ్ఞానమార్గము. ఇదియే అద్వైతతత్వము. ప్రబోధచంద్రోదయ మీ అద్వైతతత్వమును విశదీకరించును గాన నిది సర్వవేదాంతసారమని చెప్పబడినది.

ఇం దద్వైతమతమేగాక ద్వైతము, పాశుపతము, కాపాలికము మొదలగు ఆస్తీకమతములెగాక, బౌద్ధము, జైనము అను నాస్తికమతములు ప్రసక్తములై, ఖండితములైనవి. అనగా సరియైన మతములు కావని సిద్ధాంతీకరింపబడియున్నవి. న్యాయ వైశేషిక పూర్వోత్తర మీమీంసాది షడ్దర్శనముల ప్రస్తావన యిందున్నది. అద్వైతవేదాంతమునకు మూలమైన ప్రస్థానత్రయము (బ్రహ్మసూత్రములు ద్వాదశోపనిషత్తులు భగవద్గీత) ప్రస్తకి యిందుగలదు. భిన్న భిన్న మతములవలన గలుగు సందేహముల నిది నివర్తించును. గ్రంథవిషయమును బట్టి యిది శాంతరసప్రధాన మయ్యును నిందు తక్కినరసములు సందర్భానుసారముగా గలవు. ఐహికజీవితము నడపుట కిది యౌపదేశికమేగాక, దీనిని పఠించినవానికి తిరిగి జన్మకలుగదు.[1]

పైవివరణమును పరిశీలించినయెడల ప్రబోధచంద్రోదయము ఆధ్యాత్మికవిషయప్రపూర్ణమై, అద్వైతవేదాంతతత్త్వజ్ఞానోపదేశికగ్రంథ మని స్పష్టమగుచున్నది. అందువలన నిది ఐహికమును వదలి ఆముష్మికదృష్టితో జీవయాత్ర గడపు ముముక్షువులకు ఆధ్యాత్మికవస్తువిచారణయందు కాలము గడపు వైరాగ్యశీలురకు నభిరుచి నభినివేశము గలిగించు గ్రంథములలో ప్రధానమైనదని నిశ్చితమగుచున్నది.

  1. ఈ సందర్భమున అద్వైతవేదాంతప్రతిపాదకమైన భాగవతమును తెనిగించుచు బమ్మెరపోతన చెప్పిన వాక్యము గమనింపదగినది.
    "మజ్జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండఁగన్" (1-21)