పుట:ప్రబోధచంద్రోదయము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని గంగమంత్రి నరసింహనృపవశీకరనయవిద్యాకరణుగా వర్ణింపబడినాడు. నరసింహనృపవశీకర అనగా నరసింహభూపతిని వశపఱచుకొనగలిగిన నైపుణ్యము గలవాడు అని అర్థము. ఆచారిత్రకసందర్భ మిది:

క్రీ.శ. 1470 లో కపిలేశ్వరగజపతి అస్తమించగానే విజయనగరరాజైన సాళువసరసింహరాయలు నెల్లూరి మండలములోని ఉదయగిరి దుర్గము నాక్రమించెను.

కపిలేశ్వరగజపతి కుమారుడైన పురుషోత్తమ గజపతి సాళ్వనరసింహుని స్వాధీనమైన ఉదయగిరిపై దండెత్తగా సాళ్వనరసింహరాయ లాతని ప్రతిఘటించెను కాని మహాబలవంతుడగు పురుషోత్తమగజపతి ధాటికి తట్టుకొనలేక అతనికి జీవగ్రాహముగా పట్టుబడెను. ఈ విషయము పురుషోత్తమగజపతి రచితమైన సరస్వతీవిలాసమున నాతని ఆనంతవరతామ్రశాసనమున చెప్పబడినది. బసవభూపాలుడు గజపతుల సామంతుడేగాన పురుషో త్తమగజపతి అతని సహాయమును కోరి యుండును. గంగమంత్రి తనరాజనీతి చాకచక్యముచేత నరసింహరాయలు జీవగ్రాహముగా పట్టుబడుటకు విశేషముగా సహాయ్యము చేసియుండెను. దీనిని పురస్కరించుకొనియే

“నరసింహనృప శీకరనయవిద్యాకరణ" అని గంగమంత్రిని సంబోధించినాడు.

పురుషోత్తమగజపతి జీవగ్రాహముగా పట్టుకొనినయతడు సాళ్వనరసింహరాయలేయని చరిత్రకారులు వాఙ్మయచరిత్రకారులు అంగీకరించినను కీ.శే. మల్లంపల్లి సోమశేఖరశర్మగారు మాత్ర మంగీకరింపలేదు.[1]

గంగమంత్రి - శివయోగి

గంగమంత్రి లోకికముగా మంత్రియై రాచకార్యములలో నిమగ్నుడైనను ఆతడు సాంసారికముగా జీవితము గడపినను తక్కినవారివలెగాక తామరాకుపై

  1. ఆంధ్రదేశచారిత్రకభూగోళసర్వస్వము ప్రథమసంపుటము పుట 211