పుట:ప్రబోధచంద్రోదయము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృతిపతి అనంతామాత్యుని గంగయమంత్రి

తెలుగున కావ్యప్రబంధము లందన్నిట సాధారణముగా కృత్యాదిలో ఇష్టదేవతాస్తుతి, సుకవిస్తుతి, కుకవినింద, ఆవెనుక కృతిపతి కవిని పిలిపించి గ్రంథము వ్రాయుమనుట, కవియు కృతిపతి వంశమును వర్ణించి, అట్టివంశమున జన్మించిన యతనికి తనకృతి నంకిత మొసగుచున్నానని షష్ఠ్యంతములు చెప్పుట పరిపాటియై యున్నది. కాని తెలుగు ప్రబోధచంద్రోదయమున నాందీ ప్రస్తావనలతో కూడిన నాటకారంభమువలె నుండియు షష్ఠ్యంతము లుండెడు ప్రబంధమువలె అవతారిక ముగియుచున్నది. ఇదియొక క్రొత్తపద్ధతి.

నాంది[1]

1. శంకరస్తుతి
2. గౌరీస్తుతి
3. విఘ్నేశ్వరస్తుతి
4. లక్ష్మీనారాయణస్తుతి
5. సరస్వతీబ్రహ్మస్తుతి.

ప్రస్తావన

కృతిపతి గంగమంత్రి సభానాయకుడు. ఆతడు బ్రహ్మసంతతివాడు. బ్రహ్మపౌత్రుడైన కశ్యపుని గోత్రమువాడు. అందుచే వంశవర్ణనతో నిది ప్రారంభ మగుచున్నది.

గంగమంత్రి శివపూజానంతరము గోష్ఠిలో నచ్చటివారు "నీవంటి ఆధ్యాత్మికప్రవృత్తిగలవారికి తగిన వేదాంతగ్రంథ మొకటి గలదు. అది సంస్కృతముననున్న ప్రబోధచంద్రోదయము అను నాటకము. అది తెలుగుభాషలో నీ కంకితమైన కస్తూరిపరిమళము బంగారమునకు, బంగారముకాంతి కస్తూరికి వచ్చినట్లగును" అని విన్నవించి ప్రబోధచంద్రోదయ ప్రశస్తిని గూర్చి తెలిపిరి. (20-21) దానిని తెలుగుచేయుటకు నందిమల్లయ ఘంటసింగయకవులు సమర్థు

  1. మూలమునందలి నాందీశ్లోకములకు తెలుగు. వానిని విమర్శభాగమున చూడనగును.