పుట:ప్రబోధచంద్రోదయము.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనర్ఘరాఘవము (క్రీ.శ. 1700)

ఇది బిజ్జుల తిమ్మభూపాలకృతము. మురారి యనర్ఘరాఘవ నాటకమునకు ప్రబంధపరివర్తనము యథామాతృకము. ఇది ముద్రితమైనది.[1]

తెలుగులో జంటకవులు

తెలుగున జంటకవులనుగూర్చి పరిశోధించిన నీక్రిందివారు గన్పట్టుచున్నారు.

కాచవిభుడు-విఠలరాజు

వీరిరువురు రంగనాథరామాయణోత్తరకాండను ద్విపద గావించిరి.[2] వీరిరువురు సోదరులు. తెలుగున తొలిజంటకవులు వీరే. వీరు క్రీ. శ 1350 ప్రాంతమువారు.

నందిమల్లయ, ఘంట సింగయ్య

ప్రబోధచంద్రోదయ, వరాహపురాణాంధ్రీకరణకర్తలు.

తురగా రాజకవి - అయ్యంకి బాలసరస్వతి

వీరిరువురు కలిసి 'నాగర ఖండము' అను పద్యకావ్యము రచించిరి. కీ. శ. 1608 ప్రాంతమువారు.

కేసన-మల్లన కవులు.

వీరిరువురు దాక్షాయణీపరిణయము అను ప్రబంధము రచించినవారు. వీరిరువురు సోదరులు. బమ్మెర పోతనవంశీయులు. పోతనకు మునిమనుమలు. క్రీ. శ. 1850 ప్రాంతమువారు.

  1. ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీవారు దీనికి తిరిగి సుపరిష్కృతముద్రణ గావించుచున్నారు.
  2. ఈ ద్విపద ఉత్తరరామాయణము పూర్వము “సరస్వతిపత్రికలో కొంతభాగము ఆ వెనుక చెలికాని లచ్చారావుగారి ఆంధ్రభాషావిలాసిని గ్రంథమాలలో చాలవఱకు ముద్రితమైనది. దీనికి సుసంస్కృతమైన శుద్ధప్రతి చాల యావశ్యకము.