పుట:ప్రబోధచంద్రోదయము.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాటకభేదము ఇది చాలావ్యాప్తమైనది. కాని దీని కర్తృత్వమును గూర్చి భిన్నాభిప్రాయములు గలవు మానవల్లివారు, వేటూరివారు దీనిని శ్రీనాథకృతిగా గ్రహింపగా తక్కిన కవిచరిత్రకారులు వినుకొండ వల్లభరాయనిదిగా గ్రహించిరి.

అప్పకవి స్పష్టముగా శ్రీనాథుని వీథినాటకము అని రెండు పద్యములను అప్పకవీయమున నుదహరించినాడు. (కుసుమంబద్దిన 3-139 కందుకకేళి 3.379) కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసంగ్రహములో "ఒచ్చెం బింతయు (1-66) కుసుమంబద్దిన" అనుపద్యములను శ్రీనాథుని వీథినాటకమునుండి యని ఉదహరించినారు. ప్రథమాంధ్రకవిచరిత్రకారులు గురుజాడ శ్రీరామమూర్తిగారు వీథినాటకము శ్రీనాథునిదిగా వ్రాసియున్నారు.

శృంగారశాకుంతలము (క్రీ శ. 1480)

పిల్లలమఱ్ఱి పినవీరన కవితాగౌరవమువలన నిది విశేషప్రచారములోనికి వచ్చినది. కథలోమార్పులు గలవు.

ప్రభోధచంద్రోదయము (కీ.శ.1480)

నందిమల్లయ ఘంటసింగయ కవులు, దీనినిగూర్చి సవిస్తరముగా ముందు తెలిపితిని ప్రబోధచంద్రోదయము, నాటక కథాక్రమముననే మార్పులు లేక యధామాతృకముగా ననువదింపబడినది. ఈ పద్ధతికి వీరే ప్రారంభకులు.

ప్రసన్నరాఘవనాట్యప్రబంధము (క్రీ.శ. 1550)

ఇది బొడ్డుచెర్ల చినతిమ్మనరచితము. జయదేవుని ప్రసన్నరాఘవనాటకమునకు యథానువాదము.[1] ఇందు ఆశ్వాసములకు బదులు అంకము లనియే యున్నది.

  1. ఈ గ్రంథము నూతనముగ 1982లో డాక్టరు బి. రామరాజుగారిచే సంపాదితమై పీఠికాపరిష్కరణములతో ముద్రితమైనది.