పుట:ప్రబోధచంద్రోదయము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుజ్ఞానఎఱుక

రామబ్రహ్మయోగిరచితము. క్రీశ 17వ శతాబ్ది ప్రతిలేని నిర్గుణిని పతిగాను మతి కోరినబుద్ధి కాంతకడ "ఎఱుక” (జ్ఞానము) అను నెఱుకత వచ్చి వేదాంతగోష్ఠి నెఱపుట ఇందలి ఇతివృత్తము.[1]

నాటకము

వివేకవిజయము

ఇది చల్లాసూరయకవిరచితము. ఈతడు క్రీశ. 16వ శతాబ్దివాడు. దాక్షిణాత్యకవి తంజావూరిదగ్గర పొందవాక గ్రామనివాసి. ఇత డద్వైతమతానుయాయి. సదానందయోగి శిష్యుడు. ఇతడు జంటకవుల తెలుగు ప్రబోధచంద్రోదయమును, వివేకవిజయము అనుపేర నాటకముగా రచించినాడు. ఇందు అంకవిభజన లేదు. నాటకమువలె పద్యములున్నను యక్షగానరీతిని తాళప్రధానము లైన త్రిపుటలు, జంపెలు, దరువులు మున్నగు గేయరచనా భేదములుగలవు. ఎడనెడ చిన్నవచనము లున్నవి. ద్విపదలు గలవు. కవి గ్రంథాంతమున దీనిని నాటక మనియే యిట్లు పేర్కొన్నాడు.

చ.

అలరగ నీవివేకవిజయాభిదనాటక మెవ్వరేని ని
శ్చలమగు భక్తిచేఁ జదువఁజాలి తదీయపదార్థభావముల్
సలలితచిత్తవృత్తి ననిశంబును చింతన చేసిరేని వా
రలఘుతరాత్మతత్వపద మంది శుభస్థితి గాంతు రెప్పుడున్.

పద్య ప్రబోధచంద్రోదయమున కిది హృద్యమైన నాటకానువాదము. అందలి కథాక్రమమే యిందలి కథాక్రమము, అందలి పాత్రలే ఇందలి పాత్రలు. చిదానందనగిరి- ఈశ్వరుడు-మాయ-మనస్సు - ప్రవృత్తి నివృత్తి భార్యలు - కామమోహాదులు-దంభుని, మోహుని కాశీనివాసము - బౌద్ధజైనచార్వాకాది మతప్రసక్తి -వివేకునికి ఉపనిషద్దేవికి సమాగమము- ప్రబోధచంద్రుని జననము తూచాతప్పక యున్నవి. నాటకాంతమున మాత్రము సూరయకవి మార్పుచేసినాడు.

  1. పై మూడును డాక్టరు యస్వీజోగారావుగారి ఆంధ్రయక్షగానవాఙ్మయమునుండి గ్రహింపబడినవి. ఆంధ్రవిశ్వకళాపరిషత్తు ముద్రణ (1964)