పుట:ప్రబోధచంద్రోదయము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్విపదకావ్యము

కావ్యకర్త రాచూరి వేంకటలింగమంత్రి. ఇది యైదాశ్వాసములు గలది. అముద్రితము.[1] ఈతడు దాక్షిణాత్యకవి. క్రీ.శ. 1800 ప్రాంతమువాడు.

ఆధునికయుగము

సంస్కృతనాటకమునకు యథానువాదనాటకకర్తలు కందుకూరివీరేశలింగము (1892) వడ్డాది సుబ్బారాయడు (1893) ఆకుండ వ్యాసమూర్తిశాస్త్రి (1911)[2] వీనిలో నేవియు ప్రచారములోనికి రాలేదు.

శ్రీగట్టి లక్ష్మీనరసింహశాస్త్రిగారి యనువాదము క్రిందటియేడు క్రీ.శ. (1975) ప్రకటితమైనది.

అద్వైతపరముగా నీ నాటకము రచించిన వెనుక సంస్కృతమున దీని కనుకరణములు బయలు వెడలినవి. వానిలో పేర్కొనదగినవి రెండు-

1 సంకల్ప సూర్యోదయము - ఇది విశిష్టాద్వైతపరముగా రచింపబడినది. కృతికర్తలు మహాప్రసిద్ధులు వేదాంత దేశికులు (1270-1372)

2 శివలింగసూర్యోదయము - ఇది శివాద్వైతపరముగా మల్లనానారాధ్యులచే రచితమైనది.

పైరెండును రచించినకవులు ప్రతిభావంతులే యైనను, కేవలము అనుకరణములుగా నిలిచిపోయినవేగాని ప్రచారములోనికి రాలేదు.

పైవివరణములనుబట్టి సంస్కృత ప్రబోధచంద్రోదయనాటకము మహాగంభీరమైన అద్వైతవేదాంతమును ప్రతిపాదించు ఆధ్యాత్మికనాటకమని మనకు స్పష్టమైనది.

  1. మదరాసు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారము తాళపత్రప్రతి 715(సమగ్రము)
  2. ఆంధ్రవాఙ్మయసూచిక పుట 118