Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయతరాజు ముమ్మన - విష్ణుకథానిధానము

చ.

స్ఫురదురుకర్ణతాళమునఁ బుట్టిన గాడ్పున విఘ్నవారిదో
త్కరములఁ బాఱఁదోలి మదధారల విశ్వముఁ దొప్ప [1]దోచుచున్
గరివదనుండు దోడుపడుఁగాత మహాగణనాథుఁ డర్థితోఁ
గరవరదస్తవంబు పని గైకొని [2]సల్పిన నాకు సత్కృపన్.

78

[3]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [1-4]

మ.

నను మన్నింపుము నీకు మామ యగు [4]మైనాకుండు నాకాధినా
థుని మ్రోలం బడునంచుఁ బార్వతి వియద్ధూత్కారముల్ మాన్చినన్
దనతుండంబునఁ చీల్చియున్న జలధిన్ దాఁ గ్రమ్మరన్ గ్రుమ్మరిం
చిన శుండాలముఖుండు మామకకృతిశ్రీ కిచ్చు నిర్విఘ్నతన్.

79

అభినవదండి కేతన – దశకుమారచరిత [1-5]

ఉ.

గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా
మిక్కిలి కంటికిన్ దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం
పెక్కెడి బాలకేళిఁ బరమేశ్వరు చిత్తము పల్లవింపఁగాఁ
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతున్ బ్రసన్నుఁగాన్.

80

కంచిరాజు సూరయ - కన్నప్పచరిత

ఉ.

[5]కొమ్మును దొండమున్ కఠినకుంభయుగంబును [నయ్యుమాకపో]
లమ్ముల చారుకాంతిఁ దొడలన్ వలిచన్నులఁ బోలు పుత్త్రకుం
డిమ్ములఁ దల్లిఁ బోలి జనియించిన సంచితభాగ్యవంతుఁడౌ
నమ్మయటంచు సిద్ధసతు లక్కునఁ జేర్చు గజాస్యుఁ గొల్చెదన్.

81

చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనము

చ.

పరముఁడు కంధరస్థలముపై నిడి వేడుక ముద్దులాడఁగాఁ
గరమున మౌళిగంగ యుదకంబులు మెల్పునఁ చీల్చి యాదిశీ
కరములు భూషణేందునకు [6]గౌరవతారకలీలఁ జేయు త
త్కరివదనుండు మత్కృతికిఁ దా సుముఖస్థితి[7]తోడఁ దోడగున్.

82

దామరాజు సోమన - భరతము

ఉ.

నంది మృదంగరావము ఘనస్తనితం బని మ్రోలనున్న యా
స్కందుని వాహనం బగు శిఖండి యఖండితనృత్యమాడ భీ

  1. క.దోగుచున్
  2. క.నిల్చిన
  3. సుంక
  4. క.మైనాకంబు
  5. క.కొమ్ములు
  6. ట.కారవ[?]
  7. క.దోడుదోడగన్