Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాకల్య అయ్యలార్యుఁడు[1] – యుద్ధకాండ [2-661]

[2]సీ.

నెలకొన నమృతంబు నిండారఁబోసినఁ
              గొమరారు రాజీవకుంభ మనఁగఁ
జిరకాల[3]సంభృతవిరహపాండురమైన
              వరయామినీవధూవదన మనఁగఁ
బాలసముద్రంబుఁ బాసివచ్చిన సుధా
              గురుతరసారంపుఁ గుప్ప యనఁగ
వలరాజు శృంగార మలవడ [4]వీక్షింప
              నమరింపఁదగు నిల్వుటద్ద మనఁగ


తే.

వెలయ రాముని యభిషేకవిధికిఁ ద్రిదశ
కాంత లెత్తిన మౌక్తికకలశ మనఁగ
జీవలోకము మిక్కిలి చెలఁగుచుండ
మిగుల నభమునఁ జంద్రుండు వొగడ నెగడె.

196

[?]

శా.

గంగాతుంగతరంగపాండురమయూఖశ్రేణి[5]కాహంసికా
భంగిం నింగికి నబ్ధికిన్ నడుమఁ బైపై నొప్పు ప్రాక్ క్షోణి[6]భృ
చ్ఛృంగాగ్రంబు నలంకరించె సితరోచిర్మండలం బభ్రమా
తంగోదంచితకుందకందుకము చందం బొందె రమ్యాకృతిన్.

197

తెనాలి రామలింగన - కందర్పకేళీవిలాసము

సీ.

తారామనోరంజనారంభ మే దొడ్డు
              శిలలు ద్రవింపంగఁజేయు ననినఁ
జాకోరహర్షయోజనకేళి యేదొడ్డు
              పేర్చి యంభోధు లుబ్బించు ననినఁ
గుముదౌఘతాపోపశమకృత్య మేదొడ్డు
              సృష్టి యంతయుఁ జల్ల సేయు ననిన
వరనిశాకామినీవాల్లభ్య మే దొడ్డు
              వర్ణింప సత్కళాపూర్ణుఁ డనినఁ


తే.

దనకు సర్వజ్ఞశేఖరత్వంబు గలుగ
హితసుధాహారవితరణం బేమి దొడ్డు
అనఁగ విలసిల్లె హరిదంతహస్తిదంత
కాంతినిభకాంతిఁ జెలువారి [7]కంజవైరి.

198
  1. భాస్కరుఁడు
  2. క.లో లేదు.
  3. గ.సంధృత
  4. గ.లింకింప
  5. క.నిశ్రేణికా
  6. క.భ్రూ
  7. క.కంస