Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవిలోకబ్రహ్మ - రత్నావళి

[1]సీ.

చిత్తజాంతకశిరస్సింహాసనంబుపై
              నిండువేడుకఁ గొలువుండు రాజు
ప్రొద్దుప్రొద్దుకుఁ దండ్రిఁ బొడగన్న [2]నివటిల్లు
              ప్రేమంబుతోడను బెంచు కొడుకు
భటులకుఁ బగలిచ్చి పని దప్పిపోకుండ
              రాత్రులు గొలువిచ్చు రమ్యమూర్తి
నిర్జరావలి నెల్ల నెలనెల దప్పక
              పడిపట్టుఁ బ్రోచిన ప్రభువరుండు


తే.

ప్రొద్దు వెన్నంటి కలువల ప్రోదికాఁడు
జారచోరులపాలిటి చల్లజంపు
కొలఁది దప్పిన విరహుల గుండెదిగులు
చంద్రుఁ డుదయించెఁ గాంతినిస్తంద్రుఁ డగుచు.

190

తులసి బసవయ్య – సావిత్రికథ

[3]సీ.

జగదేకవైభవాస్పదమైన తనమేను
              వేల్పుల కెవ్వాఁడు విందు సేసె
మన్మథాంతకు జటామండలం బెవ్వాఁడు
              దిట్టయై తోరణ గట్టుకొనియె
వనజాతవాసిని కనుజుఁడై యెవ్వాఁడు
              వేడ్క నంభోధి నావిర్భవించె
గాఢాంధకారసంఘములపై నెవ్వాఁడు
              ధవళాంశుపటలంబు దాడి పెట్టె


తే.

నట్టి వేల్పు నిశారాధ్యపట్టబద్ధుఁ
డభ్రకాసారరాజహంసార్భకంబు
తారకాలోకసౌఖ్యప్రధావిభూతి
నమరుఁ గళలకుఁ దానకం బనగఁ బఱఁగి.

191

కవికర్ణరసాయనము [4-125]

[4]సీ.

అంగసంభవుప్రోషితాలంభవిధిఁ బ్రతి
              ష్ఠింప మండెడు హేమశిఖి యనంగఁ
దిమిరాఖ్యభూతతృప్తికిఁ బాచి యను వేఁట
              నఱకిన మెడపట్టు [5]నఱ కనంగ
నాతపతప్తకల్హారలక్ష్మి నిశాం
              గన యిచ్చు మడతచెంగావి యనఁగఁ

  1. క.లో లేదు.
  2. గ.నెపుడెట్లు
  3. క.లో లేదు.
  4. ఇవి 199వ పద్యము తర్వాత కలవు.
  5. గ.నమకుఁ డనఁగ