Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[6-121]

చ.

తరుణులు చంచలా[1]లతలు తత్కరభాండనికాయ మంబుదో
త్కరములు పాలుఁ దేనెలు ఘృతంబులు వాన లఖండఖండశ
ర్కరలును ద్రాక్షపండ్లు వడగండ్లును శోభనభుక్తివేళఁ దొ
ల్కరిసమయంబు పే రెలమిఁగైకొననుండెను భోక్తృసస్యముల్.

160

శ్రీనాథుఁడు భీమఖండము [2-142]

శా.

ద్రాక్షాపానకఖండశర్కరలతో రంభాఫలశ్రేణితో
గోక్షీరంబులతోడ [2]మజ్జిగలతోఁ గ్రొన్నేతితోఁ బప్పుతో
నక్షయ్యంబుగ [3]నేరుఁబ్రాల కలమాహారంబు నిశ్శంకతన్
కుక్షుల్ నిండఁగ నారగించితిమి యక్షుద్రక్షుధాశాంతికిన్.

161

తెనాలి రామలింగయ్య హరిలీలావిలాసము

ఉ.

అల ఘృతంబు వేఁడియగు నన్నము నుల్చిన ముద్దపప్పు క్రొం
దాలిపుఁ గూర లప్పడము ద్రబ్బెడ చారులు పానకంబులున్
మేలిమి పిండివంటయును మీఁగడతోడి ధధిప్రకాండమున్
నాలుగు మూఁడు తోయములు నంజులుఁ గంజదళాక్షి పెట్టఁగన్.

162

పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [1-135]

సీ.

పెనుపారు కడియంపుఁ బిండివంటలతోడఁ
              గమ్మని సద్యోఘృతమ్ముతోడఁ
గనరు వోకుండఁ గాచిన యానవాలతోఁ
              గడి సేయవచ్చు మీఁగడలతోడఁ
చెక్కులాగుల గదంబించు జున్నులతోడఁ
              బేరి దాఁకొన్న క్రొంబెరుగుతోడఁ
బిడిచినఁ జమురు గాఱెడు మాంసములతోడఁ
              దేటతియ్యని జుంటితేనెతోడఁ


తే.

బాయసాహారములతోడఁ బడఁతు లొసఁగ
నఖిలసేనాప్రజలతోడ నారగించి
సంతసం బంది పటకుటీరాంతరమున
జనవిభుఁడు [4]భజించెను నిశాసమయసుఖము.

163
  1. క.కృతులు
  2. గ.మండెఁగలతో
  3. క.నెఱ్ఱ
  4. క.భుజించె