Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నలరుఁబోఁణులు వడ్డింప నచటఁ గలహ
భోజియును దాను బహుభక్ష్యభోజ్యలేహ్య
చోష్యపానీయముల మధుసూదనుండు
సారెఁ గొనియాడుచును వేడ్క నారగించె.

157

శ్రీనాథుఁడు – నైషధము [6-120]

సీ.

గోధూమసేవికాగుచ్ఛంబు [1]లల్లార్చి
              ఖండశర్కరలతోఁ గలపి కలపి
గ్రుజ్జుగాఁ గాఁచిన గోక్షీరపూరంబు
              [2]జమలి మండెఁగలపైఁ జల్లి చల్లి
మిరియంబుతోఁగూడ మేళవించిన తేనె
              తోరంపులడ్వాలఁ దోఁచి తోఁచి
పలుచగా వండిన వలిపెంపుఁజాఁపట్లు
              పెసరపప్పులతోడఁ బెనచి పెనచి


తే.

గోవ జవ్వాదిఁ గస్తూరిఁ గొఱతపఱుచు
వెన్న పడిదెంబు జొబ్బిల విద్రిచి విద్రిచి
వారయాత్రికు [3]లామోదవంతు లగుచు
వలచి భుజియిం రొగిఁ బిండివంటకములు.

158

[6-124]

సీ.

అమృతరసోపమంబైన కమ్మని యాన
              వాల పాయసము జంబాలమయ్యె
మంచులప్పల మించు మండెంగమడుపులు
              పొరలి తెట్టవగట్టు నురువులయ్యెఁ
గప్పురంబుల యొప్పుఁ దప్పుపట్టఁగఁజాలు
              ఖండశర్కరలు సైకతములయ్యె
గరుడపచ్చలచాయ గల పచ్చగందని
              కూరలు శైవలాంకురములయ్యె


తే.

నొలుపుఁబప్పుల తీరంబు లురలఁబడఁగఁ
బూరియలు లడ్డువంబులు పొరలి పాఱ
విమలశాల్యోదనంబుపై వెల్లిసూపు
నాజ్యధారాప్రవాహసాహస్రమునకు.

159
  1. క.లచ్చాచ్చ
  2. క.చమరి
  3. గ.లనుమోక్ష